పృథ్వీ షాపై 8 నెలల నిషేధం

0
50

నిషేధిత ఉత్ప్రేరకం వాడిన ఫలితం
దగ్గు మందే కారణమన్న క్రికెటర్‌
దిల్లీ

భారత క్రికెట్లో ఊహించని పరిణామం. గత ఏడాది తన అరంగేట్ర టెస్టులోనే అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ ఓపెనర్‌ పృథ్వీ షా.. డోపీగా తేలాడు. నిషేధిత ఉత్ప్రేరకం వాడిన అతడిపై బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించింది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏ నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, ఈ ఏడాది ఆరంభంలో వేసుకున్న దగ్గు మందులో అది ఉందని వివరణ ఇచ్చాడు పృథ్వీ. మార్చి నుంచే పృథ్వీపై నిషేధం అమలు చేయడంతో నవంబరు మధ్య కల్లా అతడి శిక్ష పూర్తి కానుంది.

పృథ్వీ షా.. గత ఏడాది వెస్టిండీస్‌తో భారత్‌ టెస్టు సిరీస్‌ సిరీస్‌ సందర్భంగా మార్మోగిన పేరు. 18 ఏళ్లకే భారత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకుని, తన తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు శతకంతో భారత క్రికెట్‌ భవిష్యత్‌ తారగా కితాబందుకున్న ఈ ముంబయి కుర్రాడు.. ఇప్పుడు ఓ ప్రతికూల విషయంతో వార్తల్లో వ్యక్తిగా మారాడు. డోపీగా తేలిన పృథ్వీపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. ఎనిమిది నెలల పాటు ఏ రకమైన క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో పృథ్వీ విఫలమయ్యాడు. అతడి మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. ఇది సాధారణంగా దగ్గు మందుల్లో ఉంటుందని పేర్కొన్న బీసీసీఐ.. అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం మ్యాచ్‌లు ఆడేటపుడు లేదా బయట దీని వాడకం నిషిద్ధమని తెలిపింది. జులై 16నే పరీక్ష ఫలితాలు వెల్లడి కాగా.. వెంటనే బీసీసీఐ పృథ్వీకి నోటీసులు జారీ చేసింది. దగ్గు మందు వినియోగం వల్లే నిషేధిత ఉత్ప్రేరకం తన ఒంట్లోకి వచ్చిందని పృథ్వీ ఇచ్చిన వివరణతో బోర్డు సంతృప్తి చెందినట్లు సమాచారం. అందుకే మార్చి 16 నుంచే అమల్లోకి వచ్చేలా పృథ్వీపై నిషేధం విధించింది. దీంతో నవంబరు 15కే పృథ్వీకి శిక్ష పూర్తి కానుంది. షాతో పాటు అక్షయ్‌ దివాల్కర్‌, దివ్య గజ్‌రాజ్‌ అనే ఇద్దరు దేశవాళీ క్రికెటర్లూ డోపీలుగా తేలి నిషేధానికి గురయ్యారు. ప్రస్తుతం టెస్టులో టీమ్‌ఇండియాకు తొలి ప్రాధామ్య ఓపెనర్లలో పృథ్వీ ఒకడు. గాయం కారణంగా రాబోయే వెస్టిండీస్‌తో సిరీస్‌కు అతడు ఎంపిక కాలేదు. నిషేధం నేపథ్యంలో ఆ తర్వాత బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌లకూ పృథ్వీ దూరం కానున్నాడు. నిరుడు వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా ఓపెనర్‌గా తొలి అవకాశం దక్కించుకున్న పృథ్వీ ఒక శతకం సహా 237 పరుగులతో అదరగొట్టాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు గెలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనకూ ఎంపికైన పృథ్వీ.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాదానికి గాయం కావడంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత భారత్‌ టెస్టులే ఆడలేదు. గాయం నుంచి కోలుకుని ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబయికి ప్రాతినిధ్యం వహించిన అతను.. ఆపై దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌ కూడా ఆడాడు. ఇటీవలే తుంటి గాయానికి గురైన పృథ్వీ.. వెస్టిండీస్‌-ఎతో భారత్‌-ఎ వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. అతను ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉంటూ ఫిజియోల సాయంతో గాయం నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ ఏడాది నవంబరు మధ్య వరకు నేను క్రికెట్‌ ఆడలేనని తెలిసింది. నేను తెలియకుండా తీసుకున్న దగ్గు మందులో ఉన్న నిషేధిత ఉత్ప్రేరకం ఫలితమిది. ఫిబ్రవరిలో ఇండోర్‌ వేదికగా ముస్తాక్‌ అలీ ట్రోఫీ సందర్భంగా తీవ్రమైన దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూ ఆ మందు వాడాను. ఆస్ట్రేలియా పర్యటనలో అయిన పాదం గాయం నుంచి కోలుకుని, ఆటలోకి తిరిగొస్తున్న సమయంలో ఇది జరిగింది. త్వరగా ఆటలోకి రావాలనే ఆతృతలో నేను వాడే మందు విషయంలో జాగ్రత్త వహించలేదు. అయితే తీర్పును శిరసావహిస్తాను. నేనాడిన చివరి టోర్నీలోనూ గాయపడ్డాను. దాన్నుంచి కోలుకుంటున్న సమయంలో ఈ వార్త నన్ను కుదిపేసింది. ఈ ఉదంతం మిగతా క్రీడాకారులు చిన్న చిన్న మందులు వాడేటపుడు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తుందని ఆశిస్తున్నా. ఈ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, సన్నిహితులకు ధన్యవాదాలు. క్రికెట్టే నా జీవితం. భారత్‌కు, ముంబయికి ఆడటం కంటే పెద్ద గౌరవం మరేదీ లేదు. ఈ పరిణామం నుంచి త్వరగా కోలుకుని, మరింత దృఢంగా తయారై వస్తా.

– పృథ్వీ షా

ఆ ధ్రువపత్రం ఉండుంటే..

కప్పుడు దేశంలోని మిగతా క్రీడాకారులందరూ అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల్ని అనుసరిస్తుంటే.. బీసీసీఐ మాత్రం క్రికెటర్లను దాని పరిధిలోకి తీసుకురావడానికి ససేమిరా అంది. చివరికి 2017లో ‘వాడా’కు తలవంచింది. అప్పట్నుంచి భారత క్రికెటర్లు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) అధికారులు కోరినపుడల్లా నమూనాలు ఇస్తున్నారు. తాము ఎప్పుడు, ఎక్కడ ఉంటున్న వివరాలు అడిగినా చెబుతున్నారు. నాడా అధికారులు తమకు తోచినపుడు క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ముస్తాక్‌ అలీ ట్రోఫీ సందర్భంగా నిర్వహించిన పరీక్షలో పృథ్వీ డోపీగా తేలాడు. అతను ఇచ్చిన నమూనాల్లో ఉన్న టెర్బుటలైన్‌ ‘వాడా’ నిషేధిత జాబితాలో ఉంది. దీన్ని దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులకు ఉపయోగించే మందుల్లో వినియోగిస్తారు. ఎవరైనా అథ్లెట్‌ చికిత్స కోసం ఈ మందును ఉపయోగిస్తున్నట్లుగా ధ్రువపత్రం తీసుకుని దాన్ని డోపింగ్‌ నిరోధక అధికారులకు ముందే సమర్పిస్తే.. మినహాయింపు ఇస్తారు. పృథ్వీ అలా ఏమీ చేయకపోవడంతో నిషేధం తప్పలేదు.