గాయాలతో సతమతమవుతున్న భారత యువ ఓపెనర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో బీసీసీఐ అతడిని ఎనిమిది నెలల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం ఈ ఏడాది మార్చి 16నుంచి అమలులోకి వస్తుంది. దీంతో నవంబరు 15 వరకు అతడు క్రికెట్‌కు దూరం కానున్నాడు. షాతో పాటు విదర్భ అండర్-23 ఆటగాడు అక్షయ్ దుల్లార్వర్‌పై కూడా ఎనిమిది నెలలు సస్పెన్షన్ విధించారు. అలాగే రాజస్థాన్ అండర్-19 క్రికెటర్ దివ్య గజరాజ్‌పై ఆరు నెలల వేటు పడింది. ప్రస్తుతం 19 ఏళ్ల పృథ్వీ షా తుంటి నొప్పితో బాధపడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సందర్భంగా ఫిబ్రవరి 22న షాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. యాంటీ డోపింగ్ టెస్టులో భాగంగా క్రికెటర్ల నుంచి శాంపిల్ తీసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే షా ఇచ్చిన శాంపిల్‌లో ‘వాడా’ నిషేధిత జాబితాలో ఉన్న టెర్బుటలైన్ ఆనవాళ్లున్నట్టు తేలింది. దీంతో బీసీసీఐ డోపింగ్ నిరోధక నిబంధన (ఏడీఆర్) ఆర్టికల్ 2.1 కింద జూలై 16న తాత్కాలిక నిషేధం విధించింది. మరోవైపు శక్తిని పెంచుకోవడానికి కాకుండా దగ్గు నివారణ కోసమే ఆ ఉత్ర్పేరకాన్ని తీసుకున్నట్టు షా విచారణలో తెలిపాడు. ‘డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలిన ముంబై ఆటగాడు పృథ్వీ షాను మార్చి 16 నుంచి నవంబరు 15 వరకు ఎనిమిది నెలలపాటు సస్పెండ్ చేస్తున్నాం. అయితే అతను ఉద్దేశపూర్వకంగా ఈ డ్రగ్‌ను తీసుకోలేదనే వాదనను మేం నమ్ముతున్నాం. నిషేధిత టెర్బుటలైన్ ఆనవాళ్లు సహజంగానే దగ్గు మందులో కనిపిస్తుంటాయి’ అని బీసీసీఐ తెలిపింది. దాదాపు మరో నాలుగు నెలలు ఆటకు దూరం కానుండడంతో దక్షిణాఫ్రికాతో సిరీస్ మొత్తానికి బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పృథ్వీ షా దూరమైనట్టే. అయితే బీసీసీఐ నిబంఽధనల ప్రకారం మరో రెండు నెలల్లో నిషేధం ముగుస్తుందనగా అంటే సెప్టెంబరు 15 నుంచి అతడు శిక్షణ కొనసాగించేందుకు జట్టు లేక క్లబ్ సౌకర్యాలను ఉపయోగించుకునే వీలుంటుంది.
అడుగడుగునా అడ్డంకులే..
చిన్నప్పటి నుంచే క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ చిచ్చర పిడుగుకు నిజంగా కాలం కలిసి రావడం లేదు. అద్భుత నైపుణ్యం కలిగి ఉండడంతో అండర్-19 ప్రపంచక్‌పను సాధించి పెట్టిన తర్వాత అతడు ఏకంగా భారత టెస్టు జట్టులోనే చోటు దక్కించుకున్నాడు. 2018లో రాజ్‌కోట్‌లో విండీ్‌సతో జరిగిన టెస్టులో శతకంతోనూ ఆకట్టుకున్నాడు. అయితే గతేడాది నవంబరులో ఆసీస్ టూర్‌కు ఎంపికైనా గాయంతో స్వదేశానికి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కోలుకుని ముస్తాక్ అలీ, ఐపీఎల్‌తో పాటు ముంబై టీ20 లీగ్‌లో ఆడాడు. కానీ మరోసారి గాయపడడంతో ఇటీవలి విండీస్ ‘ఎ’తో సిరీ్‌సకు, అలాగే భారత టెస్టు జట్టుకు దూరం కావాల్సి వచ్చింది.
ఏదీ.. పర్యవేక్షణ?
పృథ్వీ షా ఘటనతో అసలు యాంటీ డోపింగ్‌పై యువ ఆటగాళ్లకు ఏమాత్రం శిక్షణ ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై తరఫున రెగ్యులర్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడంతో పాటు భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగలిగిన షా.. ఇలా అపరిచిత ఫార్మాసిస్ట్ సూచనల మేరకు మందు వాడడం ఆశ్చర్యంగా మారింది. ముంబైలాంటి జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ఏ క్రికెటరైనా ముందు టీమ్ డాక్టర్, మేనేజర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడాల్సి ఉంటుంది. ఏదిఏమైనా పృథ్వీ షాకు గాయాలతో పాటు అతడి అనాలోచిత చర్యలు కూడా కెరీర్‌కు అడ్డంకిగా మారాయి.