సాహిత్యంలో మేరునగధీరుడు సినారెకు జాతీయ సాహితీ అవార్డు.

0
51

తెలుగు, ఉర్దూ సాహిత్యంలో మేరునగధీరుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ కొనియాడారు. సినారె రచనలు జన హృదయంలో అజరామరం అని కీర్తించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ వేదికగా ‘‘శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్‌’’ ఆధ్వర్యంలో సినారె 88వ జయంత్యుత్సవం జరిగింది. ఈ సందర్భంగా ‘‘విశ్వంభర’’ సినారె జాతీయ సాహితీ అవార్డును ప్రముఖ కన్నడ సాహితీ దిగ్గజం, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబారకు ప్రదానం చేశారు. ఆయనకు జ్ఞాపికతోపాటు రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని సినారె కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మహమూద్‌ అలీ గౌరవ అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ‘‘విశ్వంభర’’ సినారె పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార మాట్లాడుతూ.. తనకు అత్యంత ఆప్తుడైన సినారె సాహితీ పురస్కారాన్ని అందుకున్న తొలివ్యక్తిగా గర్వపడుతున్నానన్నారు. అందుకు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. హంపి, కన్నడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించడంలో తనకు విశ్వకవి రవీంద్రుడు, సినారె ఆదర్శమన్నారు.

గ్రామీణ జీవనం, యక్షగానాలు, హరికథ తదితర జానపద సాహిత్యమే తన రచనలకు ప్రధాన ప్రేరణ అని తెలిపారు. ఈ సందర్భంగా సినారె కలం నుంచి జాలువారిన 1800 పాటలను ‘‘సినీగీత సర్వస్వం’’ పేరుతో వెలువడిన ఐదు సంకలనాలను ఆవిష్కరించారు. కేంద్రీయ హిందీ సమితి అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి కె.శివారెడ్డి, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌, శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు అధ్యక్షుడు గోవిందరాజు రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్‌.గోపి, నన్నపనేని రాజకుమారి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, గేయ రచయిత, సుద్దాల అశోక్‌తేజ తదితరులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా రావాల్సి ఉన్నా.. పార్లమెంటు సమావేశాల పొడిగింపు కారణంగా రాలేకపోవడంతో తన సందేశాన్ని పంపారు.