గుజరాత్‌లో విస్తారంగా వర్షాలు….

0
103

వడోదర: గుజరాత్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వడోదర నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. బుధవారం కేవలం 12 గంటల్లోనే అక్కడ 442మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల సంబంధిత ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. స్థానిక అజ్వా నది ప్రమాద కర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుతుండటంతో వడోదర విమానాశ్రయాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. రైల్వేస్టేషన్ల పరిసరాలు, రైలు పట్టాలపైలో భారీగా నీరు చేరడంతో 22 రైళ్లను రద్దు చేశారు. పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దభోయ్‌ జిల్లాలోని 152 మి.మీ, కార్జాన్‌లో 137మి.మీ, వాఘోడియాలో 124మి.మీ వర్షపాతం రికార్డయింది. వడోదర నుంచి సూరత్‌, ముంబయి వెళ్లే రహదారుల్లో రాకపోకలు స్తంబించాయి. విశ్వామిత్రి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. అజ్మా జలాశయంలో నీటిస్థాయి 209.45 అడుగుల నుంచి 215 అడుగులకు చేరుకుంది. నేడు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ పరిస్థితిని సమీక్షించారు. వరద ముంపునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.