బామ్మకు సాటి ఎవరు?…

0
42

ఆమె వయసు 85 ఏళ్లు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం… స్వచ్ఛందంగా రెండు కిలోమీటర్ల పొడవున్న పూరీ బీచ్‌ను శుభ్రం చేసింది. అనుకున్నది చేయడానికి వయసు అవరోధం కాదంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఆమే సక్కూబాయి దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రకు చెందిన సక్కూబాయి శ్రీశాంత్‌ జనార్ధనస్వామి సంస్థలో సభ్యురాలు. గతవారం ఆ సంస్థ జగన్నాథస్వామి ఆలయం, పూరీ జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రి సహా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది తెలిసి సక్కూబాయి సైతం సేవ చేయడానికి సిద్ధమైంది.  అలా పూరిలోని స్థానికంగా ఉండే బీచ్‌ను శుభ్రం చేయడంలో ప్రధానపాత్ర పోషించింది. ‘భగవంతుడిని పూజించే నేను చేసే ప్రతి పనిలో ఆ దేవుడినే చూస్తా. అందుకే ఈ పని చేయడానికి సిద్ధమయ్యా. మనం ఉండే పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం వేయకుండా, మనమే శుభ్రంగా ఉంచుకోవాలి’ అని చెబుతోన్న ఈ బామ్మ లక్ష్యం, ఆశయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అభినందిస్తున్నారు. పూరీ కలెక్టర్‌ బలవంత్‌ సింగ్‌ ఈమెను అభినందించి ప్రశంసాపత్రాన్ని అందించారు. వాలంటీరుగా తన బాధ్యతను నెరవేర్చిన బామ్మ వీడియో, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.