అమెరికాను పక్కకు నెట్టి చైనా తొలి స్థానంలోకి వచ్చింది.

0
31

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్ర్యతేకం: 1958లో ఆ దేశంలో కరవు కోరలు చాస్తే 4.5 కోట్ల మంది దాకా మరణించారు. పారిశ్రామికీకరణ, వ్యవసాయం మధ్య సమతూకం లేక ఆ దేశం కొన్ని దశాబ్దాలు ఇబ్బందులు ఎదుర్కొంది. 1978లో ఆ దేశ తలసరి ఆదాయం 165 డాలర్లు కాగా.. 40ఏళ్ల తర్వాత 2018 నాటికి 8,830 డాలర్లకు చేరింది. ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇది చైనా విజయగాథ. రెండు దశాబ్దాల్లోనే దేశం పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. చైనాలో ఏది మొదలుపెట్టినా అది ఒక ఉద్యమ స్థాయిలో జరుగుతుంది. అది పిచ్చుకలపై యుద్ధమైనా.. మౌలిక సదుపాయాల కల్పన అయినా అంతే. అమెరికా దిగ్గజ కంపెనీలే చైనా మార్కెట్‌ కోసం తహతహలాడిపోతున్నాయంటే ఆ దేశ ఆర్థిక శక్తిని అంచనా వేయవచ్చు. తాజాగా ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో అమెరికాను పక్కకు నెట్టి చైనా తొలి స్థానంలోకి వచ్చింది.

ఫార్చ్యూన్‌ 500లో డామినేషన్‌..
ఫార్చ్యూన్‌ 500 జాబితాలో తొలిసారి చైనాకు చెందిన 129 కంపెనీలు స్థానం సాధించాయి.(తైవాన్‌ను కలుపుకొని) ఈ సంఖ్య అమెరికా కంటే 8 ఎక్కువ. తొలి పది స్థానాల్లో అత్యధికంగా మూడు చైనా కంపెనీలు నిలిచాయి.

మావో తొందరపాటు నిర్ణయాలు..
1949లో మావో అత్యున్నత నేతగా అభివృద్ధివైపు పయనం ప్రారంభించిన చైనాకు అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి. మావో జెడాంగ్‌ అధికారం చేపట్టాక.. అగ్రరాజ్యాలతో సమానంగా చైనాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే తొందరలో 1957లో గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డుకు ఊపిరిపోశారు. ఎక్కువ ఆహార ధాన్యాలు ఉంటే కార్మికులకు మరింత ఆహారం ఇచ్చి పనిచేయించి ఉత్పత్తి పెంచవచ్చనేది ఈ విధానానికి మూలం. వ్యవసాయానికి పరిశ్రమలకు మధ్య నేరుగా సంబంధాన్ని సృష్టించారు. దీంతో వ్యవసాయం చేసే రైతులకు పంట లక్ష్యాలను విధించారు. కానీ, వనరులన్నీ పరిశ్రమల వైపు ఉండటంతో వ్యవసాయ వెనుబడింది. ఫలితంగా రైతులు లక్ష్యాలను అందుకోలేకపోయారు. దీంతో అధికారులు కాగితాలపై తప్పుడు లెక్కలు వేసి మావోకు చూపించారు. దీంతో వ్యవసాయోత్పత్తులను మరింత పెంచి ఎగుమతులు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుందని మావో తలచారు. కానీ, 1959నాటికి చైనాలో భయంకరమైన ఆహార కరవు తలెత్తింది. దీనిలో 4.5కోట్ల మంది ఆకలితో ప్రాణాలు కోల్పోయారు. ‘గ్రేట్‌ లీప్‌’ చైనా పాలిట అతిపెద్ద ఉపద్రవంగా మారింది. దీంతో తన పదవిని పదిలం చేసుకోవడానికి మావో సాంస్కృతిక విప్లవం ప్రారంభించారు. చాలా మంది విద్యావంతులు ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చైనీయులకు ఒక పీడకలగా మిగిలింది. 1976 మావో కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లపాటు అధికారం కోసం కుమ్ములాట జరిగింది.

1978 కీలక మలుపు..
1978లో చైనా ఉక్కు మనిషి డెంగ్‌ జియావోపింగ్‌ అధికార పగ్గాలు చేపట్టారు. ఆయన అదే ఏడాది జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ 11వ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా ముందు రెండు అవకాశాలు ఉన్నాయి. సంపదను పంచడం.. పేదరికాన్ని పంచడం.. నేను సంపద పంచడాన్ని ఎన్నుకుంటున్నాను’ అని తెలిపారు. అక్కడి నుంచి డెంగ్‌ జియావోపింగ్‌ ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరిచారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ పట్టును సడలించుకుంటూ వచ్చారు. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, పరిశ్రమలు ప్రారంభించడాన్ని సరళతరం చేశారు.

రెండు పాఠాలు..
1990 తరువాత ప్రపంచం ఎదుర్కొన్న రెండు కీలక  పరిణామాలు చైనాకు పాఠాలు నేర్పాయి. వాటిల్లో మొదటిది సోవియట్‌యూనియన్‌ నుంచి నేర్చుకొంది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం కాక ముందు అప్పటి ఆ దేశ అగ్రనేత మిఖాయిల్‌ గోర్బచేవ్‌ ఎదుట రెండు అవకాశాలు ఉన్నాయి. అవి రష్యా ఆర్థిక వ్యవస్థ సంస్కరించడం.. లేదా రాజకీయ వ్యవస్థను సంస్కరించడం. అయితే ఆయన ఏకకాలంలో రెండు ప్రయోగాలను ఎంచుకొన్నారు. దీనికి పెరొస్తారికా, గ్లాస్‌నాస్త్‌ అనే పేరు పెట్టారు. ఇవి ఆచరణలో ఘోరంగా విఫలమయ్యాయి. ఆర్థికంగా బలం లేకుండా లభించిన రాజకీయ స్వేచ్ఛ విపరీత పరిణామాలకు దారితీసి ఆర్థికంగా కోలుకోలేని విధంగా తయారై ముక్కలు ముక్కలుగా విడిపోయింది. దీన్నుంచి పాఠం నేర్చుకున్న చైనా రాజకీయ వ్యవస్థలో కమ్యూనిజాన్నే కొనసాగించి.. ఆర్థిక వ్యవస్థను సరళీకరించింది.

1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా పాఠాలు నేర్చుకుంది. ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌ రంగాలపై నియంత్రణ లేని ఆర్థిక వ్యవస్థలు ఈ సమయంలో బాగా దెబ్బతిన్నాయి. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచినా అత్యంత కీలకమైన ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌ రంగాలపై ప్రభుత్వ పట్టును కొనసాగించింది.  1993 నుంచి 2005 వరకు చైనాలో ఆర్థిక సంస్కరణల పర్వం కొనసాగింది. బీజింగ్‌ తన ఆర్థిక విధానం గురించి ఎక్కడా బహిరంగంగా వెల్లడించదు. 2013దాకా దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 9.5 శాతం మేర వృద్ధిని నమోదుచేసింది. దారిద్య్రం చాలావరకు తుడిచిపెట్టుకు పోయింది.

రాజకీయ స్వేచ్ఛ కనబడదు..
తొలుత ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చి తర్వాత రాజకీయ స్వేచ్ఛ ఇవ్వాలని కమ్యూనిస్టు పాలకులు భావించినా ఆ తర్వాత అది జరగలేదు. ఇప్పటికీ అక్కడ ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా.. రాజకీయ స్వేచ్ఛ ఉండదు. కమ్యూనిస్టు పార్టీనే అపరిమిత అధికారాలను చెలాయిస్తుంది. తన ఆర్థిక వృద్ధికి స్థిరమైన రాజకీయ నాయకత్వమే కారణమంటుంది. ఇది కూడా కొంత వాస్తవమే అనిపిస్తుంది. ఒకే పార్టీ విధానం అమలుతో చైనాలో రాజకీయ అస్థిరత అతి తక్కువగా కనిపిస్తుంది.

ముడి పదార్థాలకు పెద్దపీట..
అభివృద్ధికి ఇంధనం, ముడిపదార్థాలే మూలం. ఈ విషయం బీజింగ్‌ పాలకులకు తెలుసు. అందుకే ముడిపదార్థాల సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకొంటుంది. ఇప్పటికే సహజ వనరులు ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. చైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ పెట్టుబడుల బాధ్యతలను చూస్తుంటాయి.

బలం.. బలహీనత ఒకటే..
చైనాలో భారీ జనాభానే ఆ దేశానికి అతిపెద్ద బలం. ఆ కారణంగానే అక్కడ భారీ మార్కెట్‌ ఏర్పడింది. దీంతోపాటు చౌకగా కార్మిక శక్తి లభిస్తుంది. దీంతో ప్రపంచంలోని ప్రతి కంపెనీ ఆ మార్కెట్లోకి వెళ్లాలని ఆశపడుతుంది. చైనా ప్రభుత్వం దీన్ని ఒక ఆయుధంగా వాడుకొని సాంకేతిక పరిజ్ఞానం బదిలీని ఒక నిబంధనగా విధిస్తుంది. కేవలం విదేశీ పెట్టుబడులతో ఏమీ రాదని చైనా అప్పటికే గ్రహించింది. అందుకే సాంకేతికతపై దృష్టిపెట్టింది. ఆ సాంకేతికతే చైనాకు బలంగా నిలిచింది. ఆ తర్వాతి కాలంలో చైనా బలమైన ఉత్పాతదక శక్తిగా అవతరించింది. ఇప్పుడు చైనా ఉత్పత్తులు లేకపోతే అమెరికా సంస్థలే విలవిల్లాడే పరిస్థితి నెలకొంది. చైనాపై అమెరికా పారిశ్రామిక రంగం అంతగా ఆధారపడుతోంది.

అదే సమయంలో జనాభాను నియంత్రించడం కోసం 1979లో చైనా ఏక సంతానం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. 1960లలో ఒక మహిళకు సగటున ఆరుగురు సంతానం ఉంటే.. 2010 నాటికి అది 1-2కు తగ్గిపోయింది. ఒక జంట ఇద్దరు సంతానాన్ని కలిగి ఉండటానికి ప్రభుత్వం 2015లో అనుమతించింది.

చైనా సంస్థలకు దేశ మార్కెట్‌ అతి పెద్దబలం..
చైనా కంపెనీలు అత్యధికంగా దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడ్డాయి. దేశ అవసరాలను తీరుస్తూనే భారీ సంస్థలుగా రూపాంతరం చెందాయి. అమెరికా అన్ని ఆంక్షలు విధించినా హువావే విక్రయాల్లో 30శాతం వృద్ధిని నమోదు చేయడమే దీనికి నిదర్శనం. దీంతో చైనా కంపెనీలపై ఆంక్షలు విధించినా పెద్దగా ఒడిదొడుకులకు లోనుకావు.

ఏదైనా యుద్ధప్రాతిపదికనే..
చైనాకు స్థిరమైన రాజకీయ నాయకత్వం ఉండటంతో ఏ కార్యక్రమం చేపట్టినా ఉద్యమ స్థాయిలో చేయడం చైనీయులకు అలవాటు. అది బర్డ్‌ఫ్లూపై పోరాటమైనా కాలుష్యంపై యుద్ధమైనా అంతే. నాలుగేళ్ల క్రితం చైనా కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. వినూత్న విధానాలు, కఠిన నిబంధనలతో దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇది ఫలితం ఇచ్చి 35శాతం కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దటీజ్‌ చైనా..!