చిన్నచిన్న సమస్యలే దూరాన్ని పెంచుతాయి.

0
106

చిన్నచిన్న సమస్యలే భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. అవేంటో వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దామా..

*ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే జంటలే ఎక్కువ. ఇది మంచిదే కానీ.. ఉద్యోగం, ఇతర పనుల పేరుతో ఒకరికోసం మరొకరు సమయం కేటాయించుకోవట్లేదేమో గమనించుకోండి. ఈ నిర్లక్ష్యం ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచుతుంది. ఆ పొరపాటు చేస్తుంటే వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిది. ముఖ్యంగా మీరు కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలి. రెండు నెలలకోసారి ఇద్దరు మాత్రమే కలిసి ఓ రోజు విహారయాత్రకు వెళ్లడం అలవాటు చేసుకుంటే ఆ దూరం తగ్గుతుంది.
* ఒకే విషయంపై ఇద్దరిమధ్యా వాదన జరిగి ఉండొచ్చు. ఆ వాదనను అక్కడితోనే వదిలేయాలి తప్ప పదే పదే దాన్నే చర్చించుకోవడం సరికాదు. ఒకవేళ ఆ విషయమే మీ జంటను ఇబ్బందిపెడుతోంటే కలిసి కూర్చుని పరిష్కరించుకోవడం మంచిది.
* ఇద్దరిమధ్యా భావవ్యక్తీకరణ లోపించినా, ఒకరి ప్రవర్తనను మరొకరు అపార్థం చేసుకున్నా దూరం పెరుగుతుంది. అలాంటి సమస్యలు ఏవైనా  ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిది. స్పష్టమైన అవగాహన పెరిగేందుకు అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుకోండి. ఒకరిగురించి మరొకరికి తెలుస్తుంది.
* భార్యాభర్తల మధ్య సమస్య తెచ్చిపెట్టే విషయాల్లో డబ్బూ ఉంటుంది. ఒకరు ఎక్కువ ఖర్చుచేస్తున్నా, మరొకరు పొదుపుగా ఉన్నా… సమస్యే. దీన్ని అధిగమించాలంటే… ఖర్చుల విషయంలో మీకు ముందునుంచీ ఓ అవగాహన ఉండాలి. భవిష్యత్తుకోసం ఎంత ఆదా చేయాలి, వ్యక్తిగత ఖర్చులు, ఇంటి అవసరాలు… ఇలా అన్నీ కలిసి కూర్చుని మాట్లాడుకుని చూడండి.