జ్యోతిక, రేవతి నటించిన కొత్త చిత్రం ‘జాక్‌పాట్‌’

0
178
ఒకప్పుడు యువత హృదయాల్లో గిలిగింతలు పెట్టి.. ఇప్పుడు సందేశాత్మక, మహిళా సాధికారత చాటే చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది జ్యోతిక. పెళ్లి తర్వాత తన ఇమేజ్‌కు తగ్గట్టు సినిమాలను ఎంచుకుని ఆకట్టుకుంటున్నారు. కల్యాణ్‌ దర్శకత్వంలో ఆమె నటించిన కొత్త చిత్రం ‘జాక్‌పాట్‌’ శుక్రవారం తెరపైకి వస్తోంది. తర్వాతి వారం తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రంలో రేవతి కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా జ్యోతిక, రేవతి పాత్రికేయులతో ముచ్చటించారిలా..

మీ సినిమాలన్నింటిలోనూ ప్రజలకు సేవ చేసేలా పాత్రలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వస్తారా?

జ్యోతిక: రాజకీయాల్లోకి వచ్చే ప్రజలకు సేవ చేయాలని లేదు. ఇప్పటికే అగరం ఫౌండేషన్‌ పేరిట సూర్య పేద విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నారు. ఇంకా చేస్తాం. రాజకీయాలపై ఆసక్తి లేదు.

జ్యోతిక నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన సినిమా ఏది?

రేవతి: సూర్యతో నటించిన ‘కాక్కకాక్క’. ఆ సినిమాలో ప్రేమ, నటన, రొమాన్స్‌.. అన్నింటిని సమపాళ్లలో వ్యక్తపరించింది జో. అలాగే ‘మొళి’ సినిమా కూడా నాకు బాగా నచ్చింది. రీ ఎంట్రీలో ‘36 వయదినిలే’ చూసి సంతోషించా.

సినిమా కోసం పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట?

జ్యోతిక: సిలంబాట్టంలో శిక్షణ తీసుకున్నా. ఓవైపు పిల్లలను చూసుకుంటూ తర్ఫీదు తీసుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఇంట్లోనే నేర్చుకున్నా. నాతోపాటు పిల్లలు, కార్తి భార్య కూడా నేర్చుకున్నారు. బుల్లెట్‌ ద్విచక్రవాహనం నడపడం కూడా నేర్చుకున్నా. అందుకు సూర్య సహకరించారు. ఫైటింగ్‌లో కూడా శిక్షణ తీసుకున్నా.

రేవతి: నేను ‘మగళీర్‌ మట్టుం’ చిత్రంలోనే బైక్‌ నడిపా. కానీ ఈ సినిమాలో జ్యోతిక నటనను చూస్తూ ఉండిపోయా.

ఈ సినిమాలో నటించడం ఎలా అనిపించింది?

జ్యోతిక: ఇక్కడ ఎవరితోనూ పోటీ లేదు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో నటించాం. సెట్‌లో కమెడియన్లు ఎక్కువ. నవ్వుతూనే షూటింగ్‌ పూర్తి చేశాం.

రేవతి: ఇద్దరికి సంబంధించిన కథ అన్నప్పుడు.. ఇద్దరూ అర్థం చేసుకుని నటిస్తేనే ఆ సినిమాకు ఆశించిన అవుట్‌పుట్‌ వస్తుంది. జ్యోతిక నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొన్ని పాటల్లో జ్యోతిక డాన్స్‌ చూసి ఆశ్చర్యపోయా.

సూర్య ఇంటి పనులు కూడా చూసుకుంటున్నారని ఇటీవల ఆడియో విడుదల కార్యక్రమంలో చెప్పారే?

జ్యోతిక: నిజంగానే నేను అదృష్టవంతురాలిని. ఇంటి పనులు మాత్రమే కాదు… భర్తగా నాకు పూర్తి సహకారం అందిస్తూ.. తండ్రిగా పిల్లలకు సంబంధించిన అన్ని బాధ్యతలను సూర్య నెరవేర్చుతున్నారు. నిజానికి ‘జాక్‌పాట్‌’ ఆడియో విడుదల రోజున పిల్లలకు పాఠశాలలో పేరెంట్స్‌ మీటింగ్‌ కూడా ఉంది. ఉదయం 7 గంటలకు మీటింగ్‌కు వెళ్లి ఆ తర్వాత ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చి, మధ్యాహ్నం నుంచి తన సినిమా షూటింగ్‌కు వెళ్లారు. ఇలాంటి రోజులెన్నో.

రేవతి దర్శకత్వంలో జ్యోతిక నటించే అవకాశం ఉందా?

జ్యోతిక: నేను రేవతికి పెద్ద అభిమానిని. ఎంతోమంది హీరోలతో కలిసిన నటించడం నాకు గొప్ప కాదు. రేవతి వంటి నాయికతో కలిసి నటించడమే గొప్పగా భావిస్తున్నా. ఆమె నాకోసం మంచి కథను సిద్ధం చేస్తే తప్పకుండా నటిస్తా.

రేవతి: అద్భుతమైన నటి జ్యోతిక. ఆమె ప్రత్యేకతను ‘మొళి’ చిత్రంలో చూశా. ఇప్పుడు నేరుగా చూసే అవకాశం దక్కింది. అందువల్ల ఆమెకు ఎలాంటి కథ సిద్ధం చేయాలో కూడా అర్థమైంది. త్వరలోనే జ్యోతిక కోసం మెగాఫోన్‌ పట్టుకుంటా.

బయో పిక్‌లలో నటించాలనుందా?

జ్యోతిక: ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. ఇప్పటివరకు బయోపిక్‌ కథల్లో నటించే అవకాశం కూడా దక్కలేదు. భవిష్యత్తులో చూద్దాం. ఇప్పటి వరకు కూడా ఫలానా చిత్రాల్లోనే నటించాలని నేనెప్పుడూ నిర్ణయించుకోలేదు. ఇప్పుడు కూడా మహిళా సందేశాత్మక చిత్రాల్లో మాత్రమే నటించాలని కూడా అనుకోలేదు. అలాంటి చిత్రాలు వస్తున్నాయి, అందుకే నటిస్తున్నా.

రీఎంట్రీ తర్వాత మహిళా సాధికారత చిత్రాల్లోనే నటిస్తున్నారే?

జ్యోతిక: అదేం లేదు. మళ్లీ చెబుతున్నా.. నేను ఓ నదిలా ప్రవహిస్తున్నా. ఆ దారిలో ఎన్నో మలుపులు, పర్వతాలు కూడా తారస పడుతుంటాయి. కానీ ప్రత్యేకించి ఓ మార్గంలో వెళ్లాలనుకోవడం లేదు. ఇప్పుడు ‘జాక్‌పాట్‌’ అందుకు భిన్నంగా ఉంటుంది.

రేవతి స్థానాన్ని ఎవరైనా భర్తీ చేశారని అనుకుంటున్నారా?

రేవతి: ఇక్కడ ఎవరికీ ప్రత్యేక స్థానం అంటూ లేదు. ఎవరి ప్రత్యేకత వారిది. నేను వచ్చింది 1980లలో. స్క్రిప్ట్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. నా తొలిచిత్రం భారతిరాజాతో. ఆ తర్వాత కూడా ఆయన దర్శకత్వంలోనే చేశా. అనంతరం తెలుగులో బాపు దర్శకత్వంలో నటించా. ఇలా ఆరంభంలోనే గొప్ప దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అలాంటప్పుడు ఏదో ఒక చిత్రంలో నటిస్తే ప్రేక్షకులు ఊరుకోరుగా. అందుకే నటనకు ప్రాధాన్యం కలిగిన సినిమాల్లో నటించా. ఆ తర్వాత మహిళా సాధికారత చిత్రాలు చేశా. అప్పట్లో హీరోయిజం అంతగా లేదు. నేను, సుహాసిని, రాధిక, భానుప్రియ, ఊర్వశి.. అందరం ఎన్నెన్నో భిన్నమైన పాత్రల్లో నటించాం. బహుశా ఆ రోజులు ఇక రావేమో!

ఈ మధ్య హీరోలను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నారే?

జ్యోతిక: అలాంటిదేం లేదు. నిజం చెబుతున్నా. కథానాయిక ప్రాధాన్యం కలిగిన చిత్రాల్లో ఆశించిన స్థాయిలో సాంకేతిక కళాకారులు కూడా ఉండటం లేదు. కొత్తవారే ఇలాంటి చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ వంటి సంగీత దర్శకులు మాలాంటి సినిమాలకు సంగీతం అందించడం లేదు. రెహ్మాన్‌ను మీడియా ప్రశ్నించినా సంతోషిస్తా. ఇలాంటి సాంకేతిక కళాకారుల కొరత చాలా ఉంది. అయితే జాక్‌పాట్‌ చిత్రంలో హీరోకు దీటైన సన్నివేశాలు చాలా ఉన్నాయి.

రేవతి: ‘జ్యోతిక.. మీరు మాట్లాడటం నాకు చాలా గర్వంగా ఉంది’. మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇలా మాట్లాడేందుకు ధైర్యం ఉండాలి.

‘రాక్షసి’ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చింది? పలు విమర్శలు కూడా వచ్చాయి కదా..!

జ్యోతిక: ప్రభుత్వ పాఠశాలల తీరు గురించి ఆ చిత్రంలో స్పష్టంగా చెప్పాం. ఇది ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ఒకట్రెండు సన్నివేశాలు తప్పనిస్తే అంతా వాస్తవమే. చాలా మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నన్ను అభినందిస్తూ లేఖలు పంపించారు. అంతేకాకుండా ఈ సినిమా చూశాక.. పలువురు పాఠశాలలను దత్తత తీసుకుంటున్నారు. ఈరోడ్‌లో కూడా ఇటీవల ప్రభుత్వ బడిని దత్తత తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఓ జిల్లాలో పాఠశాలకు బస్సును సమకూర్చారట. ఆర్థికపరమైన సహాయం చేస్తున్నారు. నా సినిమా బాగుందని మెచ్చుకోవడం కన్నా.. ఇలాంటి పాజిటివ్‌ విషయాలు ఆచరణలోకి రావడమే గర్వంగా భావిస్తా.

రీ ఎంట్రీ తర్వాత కూడా ప్రేక్షకాదరణ పొందడానికి కారణమేంటి?

జ్యోతిక: తప్పకుండా సూర్యనే. నాకన్నా గొప్పగా నటించేవారు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ వారందరికీ దక్కని అదృష్టం నాకు లభించింది. రీ ఎంట్రీ కోసం ‘36 వయదినిలే’ కథ చెప్పేటప్పుడు నిర్మాతతోపాటు దర్శకుడు వచ్చారు. అయితే ఆ నిర్మాత ఏదైనా పొరపాటు చేస్తే నా రీ ఎంట్రీ వృథా అయిపోతుందని సూర్య భావించి.. తమ సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించారు. ఆ సినిమా తర్వాత రెండు సంవత్సరాలపాటు అవకాశాలు రాలేదు. మళ్లీ 2డీ బ్యానరులో ‘మగళీర్‌ మట్టుం’ నటించా. ఇప్పుడు ఇతర బ్యానర్లలో అవకాశాలు వస్తున్నాయి. నేను నటిస్తున్న సినిమాల్లో కాస్తయిన ప్రజలకు మంచి సందేశం ఉండాలని భావిస్తున్నా.

మీరు ఎలాంటి సినిమాలో నటించాలనుకుంటున్నారు?

జ్యోతిక: హీరోగా! ఆశ్చర్యపోకండి.. అవును, హీరోలాంటి కథలో నటించాలనుంది. నిర్మాతలకు మంచి కలెక్షన్లు రావాలి. దక్షిణాదిలో కథానాయిక ప్రత్యేకతను, స్టార్‌డమ్‌ను చాటే సినిమాలు చేయాలనుంది. ‘జాక్‌పాట్‌’లో కొంత ప్రయత్నించా. ఇందులో పంచ్‌ డైలాగులతోపాటు పవర్‌ఫుల్‌ సన్నివేశాలు కూడా ఉంటాయి.