చెన్నై: దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ లాంటి సీనియర్లతో కలిసుండటం వల్ల ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్చుకున్నానని తమిళనాడు క్రికెటర్ ఎన్ జగదీశన్ చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం టీఎన్‌పీఎల్‌లో దిండిగల్ డ్రాగన్స్ తరఫున అదరగొడుతున్నాడు. ‘ఎంఎస్ ధోనీ, మైక్ హస్సీ, సురేశ్ రైనా వంటి దిగ్గజాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి సీఎస్‌కేలో భాగస్వామి కావడంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలగడం నేర్చుకున్నాను. ఆ జట్టులో అందరికీ ఎంతో అనుభవం ఉంది. ప్రశాంతంగా మ్యాచ్‌లను ముగించడం వారికి తెలుసు. అదే నాకు సాయం చేస్తోంది’ అని జగదీశన్ అన్నాడు. టీఎన్‌పీఎల్‌లో అతడు చెలరేగి ఆడుతున్నాడు. ఇప్పటికే 235 పరుగులు చేశాడు.
‘ధోనీ బంతిని బాదడం, స్టంపింగ్ చేయడం అద్భుతం. నేనూ ఎంఎస్‌డీ లాగే కీపింగ్‌లో చురుగ్గా కదలాలని కోరుకుంటున్నా. అంతే కాదు ఆయనలా మ్యాచ్‌లు ముగించాలని భావిస్తున్నా. దిండిగల్ సారథి రవిచంద్రన్ అశ్విన్ ఎంతో తెలివైనవాడు. యువకులను బాగా ప్రోత్సహిస్తాడు. ఆ స్థాయి వ్యక్తి సారథిగా ఉండటం జట్టుకు ప్రేరణనిస్తోంది. ఒత్తిడిలో అండగా ఉంటాడు. విలువైన సలహాలు ఇస్తాడు’ అని జగదీశన్ పేర్కొన్నాడు.