ఏమిటి సమస్య?.. తొందరేం లేదు. ముందు కూర్చొండి. ఇప్పుడు చెప్పండి..’ ఆత్మీయ నేస్తం అడిగినట్టుంది కదూ! ఇవే మాటలు పోలీస్ స్టేషన్లో వినిపిస్తే.. ఖాకీ వెనక కరుణ కనిపిస్తే.. అది విజయనగరం జిల్లా సీతానగరం ఠాణా అవుతుంది. అందుకే దేశంలో ఎంపికైన పది ఉత్తమ పోలీస్స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ స్టేషన్ కథేంటో చదివేయండి మరి..
పో లీసులంటే ప్రజలకు రక్షకులు. అయినా వాళ్లంటే చాలామందికి భయం. నేరస్తులకే కాదు.. సాధారణ పౌరుడికీ పోలీసోళ్లను చూడగానే బెరుకు. వాళ్లు అనుమానంగా చూశారా… ఏ నేరం చేయకపోయినా ఒంట్లో వణుకు పుడుతుంది. ఇలాంటివేమీ సీతానగరంలో కనిపించవు. ఇక్కడ పోలీసులంటే స్నేహితులు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు ఆహ్లాదాన్ని అందిస్తే.. అక్కడి పోలీసులు ఆత్మీయతను పంచుతారు. పచ్చని చెట్లు, మొక్కలు, పచ్చికతో ఉండే స్టేషన్ పరిధిలోకి రాగానే ఉద్యానవనంలోకి వచ్చామా అన్నట్టుగా ఉంటుంది. బాధితులు ఎవరు వచ్చినా.. సిబ్బంది వెంటనే స్పందిస్తారు. గదిలో కూర్చోబెడతారు. బాధపడుతుంటే ఓదారుస్తారు. వచ్చిన పనేంటో తెలుసుకుంటారు. వాళ్లే చొరవ తీసుకుని ఫిర్యాదు రాస్తారు. బాధితుల్లో ధైర్యం నింపడానికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తారు. ఇదీ సీతానగరం పోలీసింగ్. అందుకే ఇది ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది.
తెలుగు రాష్ట్రాల్లో..
గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ పోలీస్స్టేషన్ల ఎంపిక కోసం కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా సర్వే చేసింది. ఇందులో భాగంగా కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. స్టేషన్ నిర్వహణ, పరిసరాలు, పరిశుభ్రత, కేసుల సత్వర పరిష్కారం, ప్రజా సంబంధాలు, ఫిర్యాదుల స్వీకరణ వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఈ సర్వే నిర్వహించి 2018కి గాను దేశంలోని ఉత్తమ స్టేషన్లను పదింటిని ఎంపిక చేసింది. అందులో సీతానగరం పోలీస్‌స్టేషన్ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత వహించిన ఏకైక స్టేషన్‌గా నిలిచింది. అప్పటి డీజీపీ ఆర్పీ ఠాగూర్ చేతుల మీదుగా ఎస్ఐ కృష్ణమూర్తి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
* అదే ఆదర్శం..: 2013లో బదిలీపై ఇక్కడికి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ పి.రవికుమార్ హయాం నుంచి ఈ స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ఆయన బదిలీపై వెళ్లిపోయిన తర్వాత అదే ఒరవడి కొనసాగింది. తర్వాత వచ్చిన ఎస్ఐలు వాసుదేవ్, సాయికృష్ణ, లక్ష్మణరావు, కృష్ణమూర్తి అదే ఆదర్శాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. భార్యాభర్తల మధ్య తగాదాల కేసులు తరచూ వస్తుంటాయి. ఈ తగవులను ఆరుబయట పరిష్కరించరు. స్టేషన్ ప్రాంగణంలోని ఉద్యానవనంలో ప్రత్యేక నిర్మాణం ఉంది. అక్కడే ఇరు పక్షాలనూ సమావేశపరుస్తారు. మొదటి ప్రయత్నంగా గ్రామపెద్దలను రంగంలోకి దింపుతారు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే.. వాళ్లే కలగజేసుకుంటారు. మంచి మాటతో నచ్చజెప్పి దంపతుల మధ్య స్పర్ధలు తొలిగేలా కృషి చేస్తారు. కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతారు.
* విధిగా మొక్కల సంరక్షణ: బాధితుల విషయంలో ఎంత ప్రేమగా ఉంటారో.. నేరస్తుల విషయంలో అంతే కఠినంగా వ్యవహరిస్తారు. కేసులను పరిష్కరించడంలో వేగం, ఫైళ్ల నిర్వహణలో కచ్చితత్వం.. సీతానగరం పోలీసుల పనితీరును అందరూ భేష్ అనేలా చేశాయి. ఠాణాలో తాగునీరు, మరుగుదొడ్లు, కుర్చీలు ఇలా మౌలిక వసతులు కల్పించి ఉత్తమ స్టేషన్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ మొత్తం 24 మంది పోలీసులు ఉన్నారు. వీరంతా శని, ఆదివారాల్లో మొక్కల సంరక్షణ విధిగా చేపడతారు. పోలీస్ స్టేషన్ ద్వారా ఏయే సేవలు అందుతాయో తెలియజేస్తూ గ్రామాలు, పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నిరక్షరాస్యులకు పోలీసు విధులను వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకొస్తున్నారు.