ఉన్నావ్‌ కేసులో ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..

0
37

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి ‘ఉన్నావ్‌’ అత్యాచార ఘటన అద్దం పడుతోందని సుప్రీంకోర్టు న్యాయవాది డి.రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనం ముందు బాధితురాలి తరఫున గురువారం వాదనలు వినిపించి, ఈ కేసుల విచారణ మొత్తం దిల్లీకి బదిలీ అయ్యేలా చూడటంతో పాటు బాధితురాలికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి మధ్యంతర సాయం కింద రూ.25 లక్షల పరిహారం వచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశించటంలో కీలకపాత్ర పోషించిన. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌కు అక్కడి పోలీసు యంత్రాంగం సంపూర్ణంగా సహకరిస్తోందని, ఫలితంగా బాధితులకు ప్రభుత్వపరంగా సాయం అందే పరిస్థితి అక్కడ కనిపించడం లేదని చెప్పారు.

ఉన్నావ్‌ కేసులో బాధితురాలికి సంబంధించిన ఐదు కేసుల్ని లఖ్‌నవూ నుంచి దిల్లీకి బదిలీ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. శుక్రవారం ఇందులో మార్పులు చేసింది. రోడ్డు ప్రమాదం కేసు తప్ప మిగిలిన నాలుగు కేసులు బదిలీ చేయాలంది. ఈ కేసును బదిలీ చేయడం వల్ల లఖ్‌నవూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి న్యాయపరిధి దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. నిందితుల రిమాండు, కస్టడీ, బెయిల్‌కు సంబంధించి ఆదేశాలు జారీ చేయడానికి స్థానిక కోర్టుకే అధికారాలు కట్టబెట్టాలన్న సీబీఐ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మన్నించింది. దర్యాప్తును వేగిరపరచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఆఘమేఘాల మీద మరో 20 మందిని శుక్రవారం నియమించింది. దీంతో మొత్తం అధికారుల సంఖ్య 25కు చేరింది.

లఖ్‌నవూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు, ఆమె న్యాయవాదిని దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించడంపై వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలికి లఖ్‌నవూ ఆసుపత్రిలోనే చికిత్స చేయించడానికి ఆమె కుటుంబసభ్యులు సుముఖత వ్యక్తం చేస్తున్నారని అమికస్‌ క్యూరీ, వి.గిరి సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.