ఒకప్పుడు సాధారణ టీచర్.. ఇప్పుడు ఇండియా కొత్త బిలియనీర్‌

0
51

ఒకప్పుడు సాధారణ టీచర్.. క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు బోధించేవాడు. ఏడేళ్లలోనే ఇండియాలో కొత్త బిలియనీర్‌గా అవతరించాడు. ఎడ్యుకేషన్ యాప్ డెవలప్ చేసిన అతడు.. అంచెలంచెలుగా ఎదిగి బిలియనీర్‌ క్లబ్‌లో చేరాడు. అతడే.. బైజూ రవీంద్రన్. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ థింక్ అండ్‌ లెర్న్ ప్రైవేట్ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉన్న ఆయన.. ఇటీవలే 150 మిలియన్ డాలర్ల నిధులను సాధించిన తరువాత అరుదైన క్లబ్‌లో చేరాడు. ఈ ఒప్పందం ద్వారా సంస్థకు 5.7 బిలియన్ డాలర్ల విలువను అందించింది. రవీంద్రన్‌కు 21శాతం కంటే ఎక్కువ భాగస్వామ్యం ఉన్నట్టు ఓ నివేదిక తెలిపింది.

బైజూ భారతీయ విద్య కోసం ఏదైనా చేయాలని అనుకునేవాడు. మౌస్‌ హౌస్‌ ద్వారా విద్యార్థులకు వినోదాన్ని పంచేవాడు. అదే అతన్ని  సృజనాత్మకంగా ముందుకు అడుగు వేసేలా చేసింది. తన కొత్త యాప్‌లో డిస్నీలోని పాత్రలయిన లయన్ కింగ్స్ సింబా నుంచి ఫ్రోజెన్ అన్నా వరకు మూడు తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లీష్ నేర్పించేవాడు. అదే పాత్రలు యానిమేటెడ్ వీడియోలు, ఆటలు, కథలు, ఇంటరాక్టివ్ క్విజ్‌లలో విద్యార్థులను ఆకర్షించేలా డిజైన్ చేశాడు. ‘ప్రతిచోటా పిల్లలు డిస్నీ సింబా లేదా మోవానాతో ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. ఆసక్తి ఉన్న పిల్లలు నేర్చుకునే వాటిపైనే ముందు దృష్టి పెడతామని’ సీఈవో రవీంద్రన్ అన్నారు.  దేశంలో స్మార్ట్‌ఫోన్‌లు, అతి తక్కువ ధరతో డేటా లభిస్తుండటంతో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది.2020 నాటికి భారత్‌ ఆన్‌లైన్ లెర్నింగ్ మార్కెట్  5.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా వేసింది.

బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్  కేరళలోని కన్నూర్‌ జిల్లాలోని అజికోడ్‌కు చెందినవారు.  బాల్యంలో చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఫుట్‌బాల్ మైదానానికి తరచూ వెళ్లి ఆడుతూ, ఆపై ఇంట్లో స్వయంగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంజినీర్ అయ్యాడు.  2015లో తన విద్యకు సంబంధించి ప్రధాన యాప్ ప్రారంభించాడు. అంతకుముందు ఆన్‌లైన్ పాఠాలను అందిస్తూనే 2011లో థింక్ & లెర్న్‌ కంపెనీని స్థాపించాడు.  అక్కడి నుంచి రవీంద్రన్ అంచెలంచెలుగా ఎదుగుతూ బిలియనీర్ స్థాయికి చేరుకున్నాడు.