వరుస విజయాలతో సమంత..

0
57

గత కొన్నేళ్లుగా సమంత నట ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. తెలుగులో రంగస్థలం, మహానటి, మజిలీ, తమిళంలో అభిమన్యుడు, సూపర్‌ డీలక్స లాంటి చిత్రాలు ఆమెకు వైవిధ్యమైన పాత్రలతో పాటు ఘన విజయాలనూ అందించాయి. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సమంత చేసిన తాజా చిత్రం ఓ బేబీ. కొరియన్‌ ఫిల్మ్‌ మిస్‌ గ్రానీ చిత్రానికి ఇది రీమేక. శుక్రవారం ఓ బేబీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను సమంత మాటల్లో వింటే..

దర్శకురాలు నందినీరెడ్డిని కలిసి ఈ సినిమా చేద్దామని అడిగాను. జబర్దస్త్‌ సినిమా సమయం నుంచీ నందినీతో నాకు స్నేహం ఉంది. తనది చిన్న పిల్ల మనస్తత్వం. మంచి వ్యక్తిత్వం గలది. వినోదాన్ని పండించేలా సినిమా చేయడంలో ఆమె ప్రతిభావంతురాలు. ఓ బేబీని అందరికీ నచ్చేలా రూపొందించింది.

నాయిక ప్రధాన చిత్రం అనగానే అందరికీ థ్రిల్లర్‌, హారర్‌, మహిళా, సామాజిక సమస్యల చిత్రాలే కనిపిస్తాయి. కానీ ఈ చిత్రంలో వీటికి భిన్నంగా పూర్తి వినోదాత్మక సినిమా చేశాం. కష్టపడి పనిచేశాం. అయితే ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి. నా గత చిత్రం యూ టర్న్‌ బాగుందంటూ పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. ఓ బేబీకి ఇంతగా ప్రచారం చేస్తున్నాం. రేపు ఫలితం ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్నా. సినిమాకు డబ్బులు రాకుంటే కొన్నాళ్లు పారిపోతానని చైతూతో చెప్పాను.

 

 

 

 

 

 

చైతూ సినిమాల విడుదల సమయంలో తిరుపతి వెళ్తుంటాను. కానీ ఈసారి నా సినిమా విడుదలవుతుండగా తిరుపతి వెళ్లాను. ఇలా వెళ్లడం ఇది తొలిసారి. నా గత కొన్ని చిత్రాలకు దగ్గరుండి ప్రచారం చేస్తున్నాను. నా సినిమాకు నేను ప్రచారం చేయాలి కదా. ఈ చిత్రంలో పాతికేళ్ల అమ్మాయి అరవై ఏళ్ల బామ్మగా నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నేను ఉద్వేగభరిత సన్నివేశాల్లో, రొమాంటిక్‌ సందర్భాల్లో తేలికగానే నటిస్తాను. అవి అలవాటు అయ్యాయి కూడా. కానీ తొలిసారి హాస్య పాత్రలో నటిస్తున్నా. నవ్వించే సన్నివేశాలు చూసేవారికి బాగానే ఉంటాయి కానీ నటించే వాళ్లకు శ్రమ చాలా ఉంటుంది. ఈ చిత్రంతో నేనది అనుభవించాను. సాయంత్రం అయ్యేసరికి బాగా అలసిపోయేదాన్ని. అరవై ఏళ్ల బామ్మగా నటించేందుకు కొంత పరిశీలన కావాలని వృద్ధాశ్రమాలకు వెళ్లాను. అక్కడ వాళ్లెలా ప్రవర్తిస్తున్నారో చూశాను. నాకు మా నాన్నమ్మ, అమ్మమ్మతో గడిపిన సందర్భాలు తక్కువ. అందుకే కొంత సాధన చేశాను. ఒక రోజు మాత్రం లక్ష్మీ గారితో పనిచేశాను. ఆమె హావభావాలు పరిశీలించాను. ఓ బేబీ చిత్రానికి దర్శకురాలితో కలిపి మొత్తం ఏడెనిమిది మంది అమ్మాయిలు పనిచేశారు. ఇక్కడ ప్రతిభ ఉంటేనే రాణిస్తాం. అంతే గానీ లింగ బేధాల వల్ల కాదు. ఒక అబ్బాయి కంటే నాయిక నేను ఎక్కువ కష్టపడుతుంటాను. ఈ మహిళా దర్శకురాలు, మహిళా చిత్రాలు అనే తేడా పోవాలి. అమ్మాయిలైనా కష్టపడి పనిచేశారు. ఒక్క రోజు కూడా చిత్రీకరణ ఆలస్యం కాలేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తున్నాం. మిస్‌ గ్రానీ చిత్రానికి ఓ బేబీ ఏడో రీమేక్‌ సినిమా. మామూలు రీమేక్‌ చిత్రాల్లా దీన్ని చూడలేదు. కొరియన్‌ చిత్ర బృందాన్ని కలిసి కొన్ని గంటల పాటు చర్చించాం. ఈ సన్నివేశం ఎందుకు ఉంది. దాని నేపథ్యం ఏంటి ఇలా కథ గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం.
సినిమా అంతా బాగానే నటించాను గానీ.నాకు కొడుకైన రావు రమేష్‌తో పతాక సన్నివేశం బాగా ఇబ్బంది పెట్టింది. నేను కన్న బిడ్డ, పెరిగి పెద్ద వాడై యాభై ఏళ్ల వాడు అయ్యాక అతనితో తల్లి మాట్లాడే సందర్భంలో అంత సులువుగా నటించలేకపోయాను.
నాకు రీమేక్‌ చిత్రాలు చేయాలని పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ వరుసగా అవే చిత్రాలు వస్తున్నాయి. త్వరలో 96 రీమేక్‌లో నటించబోతున్నా.

వరుస విజయాలతో నాకు విజయ రహస్యం తెలిసిందని అనుకోవడం లేదు. అలా ఎవరూ తెలుసుకోలేరు. తెలిస్తే పరిశ్రమలో అంతా ఇలా ఉండరు. మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిలో కష్టపడి పనిచేస్తున్నాను అంతే.నాకు దర్శకత్వ ఆలోచనలు లేవు గానీ మంచి చిత్రాలను నిర్మించాలని అనుకుంటున్నా. అదీ మహిళా సమస్యల నేపథ్యంతో. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటించాలని ఉంది. ఆయన నాయికల పాత్రలు బాగా తెరకెక్కిస్తారు. చైతూ శేఖర్‌ కమ్ముల చిత్రంలో నటించాలని అనుకోలేదు. మొన్నే మజిలీ సినిమాలో కలిసి నటించాం కదా. పెళ్లైన ప్రతి ఒక్కరికీ, పిల్లలు ఎప్పుడు అని అడుగుతుంటారు. అందులో తప్పేం లేదు. నేనూ పెళ్లైన నా స్నేహితురాళ్లను శుభవార్త ఎప్పుడని అడుగుతుంటా. అయితే నాకు పిల్లలను ఎప్పుడు కనాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. మా అమ్మకు, వాళ్ల అమ్మకు ఈ స్వేచ్ఛ ఉండేది కాదేమో. నేనే కాదు ఈతరం అమ్మాయిలు స్వేచ్ఛగా ఉంటూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు.