కీలకమైన ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. కీలకమైన బిల్లుల ఓటింగ్ విషయంలో పార్టీ చీఫ్ విప్ రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురెబ్బేనని చెప్పాలి.
‘‘ఆర్టికల్ 370 విషయంలో విప్ జారీ చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఇది దేశ ప్రజల వైఖరికి విరుద్ధం. పార్టీ ఎప్పటిలానే విధ్వంసం వైపు వెళుతోంది. అందులో నేను భాగస్వామిని కాలేను. అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’’ అని కలిత పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని తెలిపారు. అసోం నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 ఏప్రిల్ 9తో ఆయన పదవీ కాలం ముగియనుంది.