‘‘వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికే ఉద్యోగాలు దక్కుతాయి. పరీక్షల నిర్వహణలోనూ చూచిరాతకు వీల్లేకుండా 4 వేర్వేరు ప్రశ్నపత్రాలను తెలుగు, ఆంగ్లభాషల్లో సిద్ధం చేస్తున్నాం. పరీక్షలు జరిగిన 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించి అక్టోబరు-2 నాటికి వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ సోమవారం ‘ఈనాడు’కి ఇచ్చినఇంటర్వ్యూలో తెలిపారు.
రెండు భాషల్లోనూ ప్రశ్నపత్రాలు
వచ్చే నెల 1, 8 తేదీల్లో రెవెన్యూ డివిజన్, తాలూకా స్థాయిలో రాతపరీక్షలకు ఏర్పాట్లుచేస్తున్నాం. పట్టణ, గ్రామీణ పాంతాల్లో కలిపి 20లక్షలకుపైగా దరఖాస్తులు వస్తాయని అంచనా. ప్రశ్నపత్రాలను నాలుగు సెట్లుగా ముద్రిస్తున్నాం. పక్కపక్కన కూర్చున్న అభ్యర్థులకు వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నందున చూచిరాతలకు అవకాశం లేదు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా తెలుగు, ఆంగ్లభాషల్లోనూ ప్రశ్నపత్రాలు ఉంటాయి.
శ్రమిస్తే ఉద్యోగం మీదే
దరఖాస్తుదారులంతా ఈనెల రోజులూ శ్రమిస్తే కచ్చితంగా ఉద్యోగం సాధించగలరు. ఎంపిక చేసుకున్న పోస్టుకు సంబంధించిన అంశాలతోపాటు వర్తమాన వ్యవహారాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఆర్థమెటిక్, రీజనింగ్ వంటి అంశాలపైనా అవగాహన అవసరం. ప్రతి ప్రశ్నపత్రంలోనూ వీటికే పెద్దపీట వేస్తున్నాం. ప్రతి ప్రశ్నకూ నెగిటివ్ మార్కులు ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి.
పాలనలో కొత్త విప్లవం
వార్డు సచివాలయ వ్యవస్థతో పాలనలో కొత్త విప్లవం రాబోతుంది. అక్టోబరు-2 తరువాత సమస్యల పరిష్కారానికి ప్రజలను వెతుక్కొని ఉద్యోగులు వెళ్లే పరిస్థితి వస్తుంది. ప్రతి అంశానికో ఉద్యోగి నియామకంతో ప్రజావసరాల మేరకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇప్పటిలా సిబ్బంది కొరత పేరిట తప్పించుకోవటమనేది ఉండబోదు. ప్రజల విజ్ఞాపనలను గడువులోగా పూర్తిచేయాల్సిందే. సచివాలయ వ్యవస్థ రాకతో పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీటిసరఫరా, విద్య తదితర రంగాల్లో సత్ఫలితాలు రానున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ ఖజానాశాఖ నుంచే వేతనాలు అందుతాయి. రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.15వేలిస్తాం.. ఆపై సర్వీసు నిబంధనల ప్రకారం ఖరారు చేస్తాం.