మూడో టీ20పై కెప్టెన్ : విరాట్‌కోహ్లీ

0
34

లాడర్‌హిల్స్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను.. భారత్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలుపొందడం ద్వారా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో 6న గుయానాలో జరగబోయే మూడో టీ20లో ఇతర ఆటగాళ్లకి అవకాశమిస్తామని కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘రెండో మ్యాచ్‌ల్లో మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు.  మ్యాచ్‌లు గెలవడమే మా తొలి ప్రాధాన్యం. సిరీస్‌ గెలవడంతో.. ఇక ఇప్పటివరకూ ఆడని వారికి అవకాశమిస్తాం’ అని పేర్కొన్నాడు.

నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా బాగా ఆడారని అభినందించాడు. స్కోర్‌ 180 చేయాల్సిందని, మధ్యలో పిచ్‌ నెమ్మదించడంతో 167 పరుగులకే పరిమితమయ్యామన్నాడు.  ఈ సందర్భంగా బౌలర్ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రదర్శనను కొనియాడాడు. విండీస్ బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా సరైన సమయంలో బౌలర్లు రాణించారని చెప్పాడు.

కాగా ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌ ఇప్పటివరకు ఆడలేదు. కోహ్లీ చెప్పినట్లు కొత్తవారికి అవకాశమిస్తే ఈ ముగ్గురూ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వికెట్‌కీపర్ రిషబ్‌పంత్‌ రెండు టీ20ల్లో విఫలమైన సంగతి తెలిసిందే. ఒకవేళ అతడిని పక్కనపెడితే కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వస్తాడు. ఇప్పటివరకు తొలి రెండు టీ20లు ఫ్లోరిడాలో జరగ్గా మూడోది విండీస్‌లోని గుయానాలో జరగనుంది.