కశ్మీర్‌లో కీలకమైన ఆర్టికల్ 370ను రద్దు చేసిన 24 గంటల్లో ఒక కంపెనీ అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రకటించింది. హెల్మెట్ల తయారీ సంస్థ స్టీల్‌బర్డ్ స్పందిస్తూ కశ్మీర్‌లో పారిశ్రామిక విప్లవానికి, ఉద్యోగ కల్పనకు ఇదొక గొప్ప ప్రారంభం అని పేర్కొంది. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఇటువంటి చర్యను ఎప్పటి నుంచో ఆశిస్తున్నాం. ఈ అద్భుతమైన చర్యతో కశ్మీర్ లోయ మిగిలిన భారతావనితో కలువనుంది. దేశ సమష్టి అభివృద్ధికి ఇది మూలంగా మారుతుంది.’’ అని స్టీల్‌బర్డ్ ఛైర్మన్ సుభాష్ కపూర్ పేర్కొన్నారు.
‘‘కశ్మీర్‌లో పారిశ్రామిక వాతావరణం నెలకొల్పడానికి ఇదొక కీలక చర్య. ఇప్పటికే స్థానికంగా ఉన్న పెట్టుబడిదారులతో కలిసి పారిశ్రామిక వాతావరణం నెలకొల్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ తయారీ యూనిట్ నెలకొల్పే విషయాన్ని అక్టోబర్‌లో జరగబోయే పెట్టుబడిదారుల సదస్సులో నిర్ణయిస్తాము. ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారం నిర్వహించే విధంగా నిబంధనలు తయారయ్యేట్లు చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాం’’ అని స్టీల్‌బర్డ్ ఎండీ రాజీవ్‌కపుర్ పేర్కొన్నారు. ఇప్పటికే స్టీల్‌బర్డ్ హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీలో రూ.150 కోట్లతో ప్రాజెక్టును నెలకొల్పింది. ప్రస్తుతం ఉత్పత్తిని రోజుకు 44,500 హెల్మెట్ల స్థాయికి పెంచాలని నిర్ణయించింది.