భారతీయుడికే అగ్రతాంబూలం అంటున్న సీఏసీ సభ్యుడు

0
45

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక దాదాపు ఖాయమే అనిపిస్తోంది. కోహ్లీసేన కోచ్‌గా విదేశీయులను నియమించే కన్నా భారతీయుడే మేలని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) భావిస్తోందని సమాచారం. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామితో కూడిన కమిటీలో ఒకరు ఈ విషయం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

‘విదేశీ కోచ్‌ను ఎంపిక చేయాలన్న ఆసక్తి మాకు లేదు. నిజమే, గ్యారీ కిర్‌స్టన్‌ స్థాయి వ్యక్తులు దరఖాస్తు చేశారు. అయినప్పటికీ భారతీయుడికే తొలి ప్రాధాన్యత. అలాంటప్పుడు మార్పు కోసం ఎందుకు చూడాలి? ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఒప్పందం కుదుర్చుకొనేందుకు శాస్త్రియే ఫేవరెట్‌. ముగ్గురు సభ్యుల కమిటీ వేర్వేరు అభిప్రాయాలతో నిర్ణయం తీసుకోవడం జరగకపోవచ్చు. ముగ్గురూ వేర్వేరు వ్యక్తులను ఎంపిక చేస్తే ఛైర్మన్‌ ఓటు కీలకం అవుతుంది. ఇప్పటికైతే మేం అలా లేం. కమిటీ బోర్డుకు ఐచ్ఛికాలు ఇస్తుంది. తొలి ప్రాధాన్యం ఎ, రెండో ప్రాధాన్యం బి, మూడో ప్రాధాన్యం సి అని చెబుతాం. ఐపీఎల్‌లో కిర్‌స్టన్‌ బిజీగా ఉండటంతో మహిళల కోచ్‌ ఎంపిక సమయంలో ఇలాగే చేశాం’ అని కమిటీ సభ్యులొకరు పేర్కొన్నారు.