ప్రపంచకప్‌ తర్వాత నేడే తొలి వన్డే

0
52

భారత్‌ X వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ పూర్తైంది. కోహ్లీసేన ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమయ్యే తొలి వన్డేపై వర్ష ప్రభావం ఉండొచ్చనే సమాచారం అందుతోంది. మ్యాచ్‌ ఆరంభమయ్యే సమయంలో వర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షం కొద్దిసేపే కురుస్తుందని, తర్వాత వాతావరణం మెరుగవుతుందని పేర్కొంది. ఒకవేళ మ్యాచ్‌ ఆరంభానికి ముందే వర్షం కురిస్తే ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు ప్రపంచకప్‌లో నిష్క్రమణ తర్వాత ఆడుతున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. టీ20 సిరీస్‌లో అదరగొట్టిన యువకుల్లో ఈ మ్యాచ్‌లో ఎవరు ఆడతారనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ప్రపంచకప్‌లో చేతివేలి గాయం కారణంగా దూరమైన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రస్తుత సిరీస్‌కు అందుబాటులో ఉండడంతో అతడు రోహిత్‌తో కలిసి బ్యాటింగ్‌ చేస్తాడు. దీంతో కేఎల్‌ రాహుల్‌ నాలుగో నంబర్‌లో ఆడే అవకాశముంది.

ఇక మిడిల్‌ఆర్డర్‌లో యువ ఆటగాళ్లు మనీష్‌పాండే, శ్రేయస్‌ అయ్యర్‌లో ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి. ధోనీ స్థానంలో రిషబ్‌పంత్‌ కీపింగ్‌ బాధ్యతలు స్వీకరించడంతోపాటు ఫినీషర్‌గానూ సేవలందిస్తాడని కోహ్లీ అభిప్రాయం. ఇక స్పిన్‌బౌలింగ్‌లో చాహల్‌, కుల్‌దీప్‌, రవీంద్ర జడేజాల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా పేస్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్‌, మహ్మద్‌షమి, నవ్‌దీప్‌ సైనీ ఆడనున్నారని సమాచారం.