ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘డిప్లొమాటిక్ అవుట్ రీచ్’ పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీలు లేకపోవడం ఏపీకి ఇబ్బందికరమే అయినప్పటికీ..ఇక్కడ తీర ప్రాంతం అతిపెద్ద వనరు అని పేర్కొన్నారు. ‘‘ మా బలహీనతలు మాకు, మీకు తెలుసు. సుదీర్ఘ తీరప్రాంతం, మంచి వనరులు మా సొంతం. మాది సుస్థిర ప్రభుత్వం.. కేంద్రం సహకారం కూడా ఉంది. ఇటీవల చట్టసభల్లోనూ చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. మీ విశ్వాసం పొందేందుకు ఈ అంశాలన్నీ చెబుతున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. దిల్లీ తర్వాత ఈ స్థాయిలో ఇంతమంది దౌత్యవేత్తల సమావేశం కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అనుకుంటున్నానని జగన్ అన్నారు.
విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. ఇది వివాదాస్పదమైన నిర్ణయం అని అంతా అనుకోవచ్చని, అయితే విద్యుత్ పంపిణీ సంస్థలను రక్షించుకోవాలంటే ఇది తప్పదని వివరించారు. వినియోగదారులు, పంపిణీ సంస్థలు, ప్రభుత్వం ఎవరూ నష్టపోకూడదన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ఉన్నట్లు తెలిపారు. మీరు స్థాపించబోయే పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం కావాల్సిన అర్హతలు తెలుసుకొని స్థానిక ఇంజినీరింగ్ కళాశాలల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్రెడ్డి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.