ఆర్టికల్ 370 అమలు ద్వారా వేర్పాటువాదం, అవినీతి, కుటుంబ పాలన మినహా జమ్మూకశ్మీర్‌కు ఒరిగిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్ 370 ఉగ్రవాదాన్ని పెంపొందించడానికి పాకిస్థాన్‌కు ఓ ఆయుధంగా ఉపయోగపడిందని చెప్పారు. దీంతో మూడు దశాబ్దాల కాలంలో సుమారు 42వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న నిర్ణయం ఎంతో ఆలోచించి చేశామని.. కశ్మీరీ ప్రజల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న నిర్ణయం తాలూకు ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని ప్రధాని భరోసా ఇచ్చారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడంతో పాటు ఆ రాష్ట్రాన్ని విభజించడం ద్వారా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ చర్యతో ఒకటే భారత్.. ఒకటే రాజ్యాంగం కల సాకారమైందన్నారు. గురువారం రాత్రి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి జమ్మూకశ్మీర్ అంశంపై కీలక ప్రసంగం చేశారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిన చట్టాలన్నీ ఇకపై కశ్మీర్‌కు కూడా వర్తిస్తాయన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం, కుటుంబవాదం తప్ప సాధించిదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్-లద్దాఖ్‌లో కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పాటు ఎంతోమంది దేశభక్తుల స్వప్నం సాకారమైందన్నారు. పోలీసులు, రక్షణ బలగాల సంయమనాన్ని ఆయన అభినందించారు. ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అనేకమంది కశ్మీర్ ప్రజలు ప్రాణత్యాగం చేశారన్నారు. కశ్మీర్ శాంతియుతంగా ఉండాలన్నదే వీరందరి స్వప్నమన్నారు. స్వేచ్ఛ, శాంతి సౌభాగ్యాల కశ్మీర్ కావాలని ప్రతి భారత పౌరుడూ కోరుకుంటున్నాడని చెప్పారు. కశ్మీర్‌లో శాంతి ప్రక్రియ విశ్వశాంతికి కొత్త మార్గం నిర్దేశించాలని ఆయన ఆకాంక్షించారు.
కశ్మీర్ బాలలు ఏం పాపం చేశారు?
‘‘జమ్మూకశ్మీర్ పోలీసులకు కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదా లభిస్తుంది. విద్యాహక్కు చట్టం దేశమంతా అమలైనా కశ్మీర్‌లో కాలేదు. కశ్మీర్ బాలలు ఏం పాపం చేశారు. పునర్విభజనతో జమ్మూకశ్మీర్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టం ఉన్నాయి.. కశ్మీర్‌లో మాత్రం లేదు. ఇకపై కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా కనీస వేతన చట్టం అమలులో ఉన్నా.. కశ్మీర్‌లో లేదు. దేశ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి.. కశ్మీర్‌లో లేవు’’
త్వరలో ఫలితాలు కనబడతాయి!
‘‘కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంచాలన్న నిర్ణయం తాలూకు ఫలితాలు త్వరలో కనిపిస్తాయి. పారదర్శకత, కొత్త పని విధానం అభివృద్ధికి బాటలు వేస్తుంది. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, నూతన రహదారులు వస్తాయి. కొత్త రైల్వే లైన్లు, విమానాశ్రయాలు వస్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని కుటుంబాలు మాత్రమే పోటీ చేస్తుండేవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఎవర్నీ పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చేవి కాదు’’ అన్నారు.
ఇకపై కశ్మీర్ అభివృద్ధి కొత్త తీరాలకు..
‘‘పాకిస్థాన్ నుంచి కశ్మీర్‌కు వచ్చినవారికి ఎలాంటి హక్కులు లభించలేదు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ సంపూర్ణ హక్కులు లభించాయి.. కశ్మీర్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు స్థానికులకు అన్నింట్లో సమ భాగస్వామ్యం లభిస్తుంది. కశ్మీర్‌లో కొత్త నాయకత్వం ఉద్భవిస్తుంది. అభివృద్ధి కొత్త తీరాలకు చేరుతుంది. అక్కడి యువత నుంచి కొత్త నాయకులు పుట్టుకొస్తారు. కొత్త శాసనసభ్యులు, కొత్త ముఖ్యమంత్రులను మనం చూస్తాం. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్ అద్భుత పరిపాలన అందిస్తున్నారు’’ అని మోదీ కొనియాడారు.
పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలుపుదాం
‘‘జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. పర్యాటక రంగంలో కశ్మీర్‌ను అత్యున్నతస్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కశ్మీర్‌లో పర్యాటక రంగ పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుండేది. హిందీ, తెలుగు, తమిళం పరిశ్రమలను కశ్మీర్ వరకు తీసుకెళ్లాలి. కొత్త పరిశ్రమలు, కొత్త వ్యవస్థల ఏర్పాటులో ప్రైవేటు సంస్థలు ప్రాధాన్యమివ్వాలి. ప్రతిభావంతులైన యువత కశ్మీర్‌లో ఉంది. వారికి సరైన మార్గదర్శనం చేయాలి. కొత్త స్పోర్ట్స్ అకాడమీలు, స్టేడియాలు ఏర్పాటు చేయాలి. కశ్మీర్ కళాకారుల ఉత్పత్తులు, లద్దాఖ్ సేంద్రీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌కు అందజేయాలి. లద్దాఖ్‌లో దొరికే ఒక మూలిక ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉండేవారికి ఒక సంజీవిని లాంటిది. మంచుకొండల్లో ఉండే సైన్యం, యాత్రికులకు ఇది సంజీవిని’’ అని మోదీ అన్నారు.
ఆ పిడికెడు మంది ఆటలు సాగవు
‘‘కశ్మీర్‌పై భిన్నాభిప్రాయాలను మేం గౌరవిస్తాం. దేశ ప్రయోజనాలకు ఇబ్బంది కలగనంతవరకు ప్రతిఒక్కరి అభిప్రాయాలూ గౌరవిస్తాం. పిడికెడు మంది కశ్మీర్‌లో పరిస్థితుల్ని దిగజార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పిడికెడు మంది ఆటలు సాగవు.. లక్షలాది మంది వారికి వ్యతిరేకంగా ఉన్నారు. కశ్మీరీ ప్రజల ప్రతి అవసరం తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి ప్రతిఒక్కరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. అక్కడి ప్రజల సుఖ దుఃఖాల్లో భాగం పంచుకొనేందుకు దేశం సిద్ధంగా ఉంది’’ అని మోదీ భరోసా ఇచ్చారు.