జమ్ముకశ్మీర్‌ హోదా లో మార్పు రాజ్యాంగబద్ధంగానే జరిగాయని వెల్లడి.

0
49

జమ్ముకశ్మీర్‌ వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రష్యా సమర్థించింది. అది అంతర్గత వ్యవహారమని, భారత రాజ్యంగబద్ధంగానే కశ్మీర్‌లో మార్పులు జరిగాయని పేర్కొంది. ఈ సందర్భంగా రష్యా కూడా శిమ్లా ఒప్పందం గురించే ప్రస్తావించింది.

‘జమ్ముకశ్మీర్‌ హోదా మార్పు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేది భారత రాజ్యాంగ విధివిధానాలకు లోబడే జరిగింది. ఈ నిర్ణయాల వల్ల భారత్‌, పాక్‌ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని విశ్వసిస్తున్నాం. 1972 నాటి శిమ్లా ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా రాజకీయ, దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఆ దేశాల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి’ అని రష్యా విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది.

కశ్మీర్‌ వ్యవహారాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి భారత్‌ను తప్పుబట్టాలని ఎదురుచూస్తున్న పాక్‌కు షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ఇప్పటికే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం కోసం చేసిన పాక్‌ అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది. ఇప్పుడు తాజాగా రష్యా కూడా భారత చర్యనే సమర్థించింది. ఒకవేళ కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాక్‌ ప్రస్తావించినా భారత్‌కు రష్యా మద్దతు లభిస్తుందనేది తాజాగా స్పష్టమవుతోంది.