అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతోంది. తాజాగా చంద్రయాన్-2తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతటి ఘన విజయాలను సాధించడానికి దోహదం చేస్తున్న సంస్థే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈరోజు ఆ మహా సంస్థకు బీజం వేసిన భౌతిక శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త విక్రమ్ సారాభాయ్ శతజయంతి. ఆయన్ని భారత అంతరిక్ష రంగ పితామహుడిగా పేర్కొంటారు. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆయన చిత్రంతో కూడిన ప్రత్యేక డూడుల్‌తో ఘన నివాళులర్పించింది.
విక్రమ్ సారాభాయ్ 12 ఆగస్టు, 1919న గుజరాత్‌లో జన్మించారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసుకున్న ఆయన అనంతరం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నేచురల్ సైన్సెస్‌లో పట్టా పొందారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారత్‌కు తిరిగొచ్చి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధనలు ప్రారంభించారు. తదనంతర కాలంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చిలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనకు ఉన్న ప్రాముఖ్యతను ముందే పసిగట్టిన సారాభాయ్ ఇస్రో ఏర్పాటును ప్రతిపాదించి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సఫలమయ్యారు. ప్రముఖ అంతరిక్ష పరిశోధకులు, శాస్త్రవేత్తలు బ్రహ్మప్రకాశ్, సతీష్ ధవన్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారి ప్రతిభను గుర్తించి వారి సహకారంతో భారత అంతరిక్షరంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. భారత అణు కార్యక్రమాల్లోనూ సారాభాయ్ కీలక పాత్ర పోషించారు.
ఆయన సేవల్ని గుర్తించిన ప్రపంచ అంతరిక్ష రంగం చంద్రుడిపై ఉన్న ఓ పెద్ద క్రేటర్‌కి 1973లో ఆయన పేరుతో నామకరణం చేసి గౌరవించింది. అలాగే తాజాగా పంపిన చంద్రయాన్-2లోని ల్యాండర్‌కి ‘విక్రమ్’ అనే పేరు పెట్టి ఇస్రో ఆయనకు ఘన నివాళులర్పించింది. ఆయన శతజయంతి సందర్భంగా ఇస్రో ఈ సంవత్సరం పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈరోజు దేశంలోని 100 నగరాల్లో 100 రకాల కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభించనున్నారు.