బక్రీద్‌ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకొంటారు.

0
69
బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఇందుకోసం నగరంలోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. దీన్నే ఈదుల్‌ అజ్హా అని కూడా అంటారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ పండుగ జరుపుకొంటారు. ఆ రోజు అందరూ తల స్నానాలు చేసి.. నూతన వస్త్రాలు ధరించి, అత్తరు, సుగంధ ద్రవ్యాలు పూసుకొని మసీదులు, ఈద్గాలకు వెళ్తారు. ఉలేమాలు ఇచ్చే ధార్మిక ప్రసంగాల తర్వాత ప్రత్యేక నమాజ్‌ చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొంటారు.
బక్రీద్‌ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకొంటారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. దైవప్రవక్తలలో ఒకరైన హజ్రత్‌ ఇబ్రహీం(అలై), వారి కుమారుడు హజ్రత్‌ ఇస్మాయిల్‌(అలై) త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ జరుపుకొనే పండుగ. హజ్రత్‌ ఇబ్రహీం(అలై) ఒకసారి కుమారుడి గొంతుపై కత్తి ఉంచినట్టు కలగంటారు. దాన్ని ఆయన కలలో దేవుడు తనకు ఇచ్చిన ఆజ్ఞగా భావించి ఇస్మాయిల్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లి బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. కుమారుడి గొంతుపై కత్తి పెట్టే సమయంలో తన ఆజ్ఞను అమలు చేస్తున్నాడని అల్లాహ్‌ ప్రసన్నుడై కుమారుడి స్థానం లో అదే బలిపీఠంపై గొర్రెను ఉంచుతాడు. ఈ నేపథ్యంలో ముస్లింలు ప్రతి ఏడాది బక్రీద్‌ పండుగను జరుపుకొంటారు. కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడిన హజ్రత్‌ ఇబ్రహీం(అలై), బలి కావడానికి సిద్ధమైన ఇస్మాయిల్‌(అలై) త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు పండుగ రోజు ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక నమాజ్‌లు చేస్తారు. అనంతరం మేకలు, గొర్రెలను ఖుర్బానీ చేస్తారు.
పండుగ రోజున మేకలు, గొర్రెలను బలివ్వడం ముస్లిం సంప్రదాయం. ఆర్థిక స్థోమతగల వారు వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాతబస్తీ, శివారు ప్రాంతాల్లో లక్షలాది మేకలు, గొర్రెలు అమ్ముడయ్యాయి. నగర చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా విజయవాడ, గుంటూరు, కర్నూలు, శ్రీశైలం, కల్వకుర్తి, నల్లగొండ, మిర్యాలగూడ, జనగాం తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు మేకలు, గొర్రె పొట్టేళ్లను తెచ్చి పాతబస్తీలో విక్రయిస్తుంటారు. ఒక్కో పొట్టేలు ధర రూ. 8 వేల నుంచి 50 వేలు పలుకుతోంది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ధరలు అధికంగా ఉన్నట్లు వ్యాపారులు, కొనుగోలుదారులు అంటున్నారు. మంగళ, బుధవారాల్లో కూడా కొనుగోళ్లు జరుగుతాయి.
ఖుర్బానీ ఇచ్చిన జంతువు మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఇందులో ఒక భాగాన్ని పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులు, స్నేహితులకు, మూడో భాగాన్ని ఖుర్బానీ ఇచ్చిన వ్యక్తి ఇంటివారు తీసుకుంటారు. ఇది ఇస్లాం ఆదేశం కాబట్టి దాని ప్రకారమే ప్రతి ముస్లిం ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా సమానంగా పంచుతారు. పండుగ తర్వాత కూడా బలి ఇవ్వడానికి అవకాశం ఉండడంతో రెండు రోజుల వరకు జంతువుల అమ్మకాలు కొనసాగుతాయి. మాంసాహారం కొనుగోలు చేయలేని నిరుపేదలకు మాంసం పంపిణీ చేస్తారు. ఆర్థిక స్థోమత గల ముస్లింలు జీవితంలో ఒక్కసారైన మక్కా యాత్ర(హజ్‌)కు వెళ్తుంటారు. వారు అక్కడ కూడా తమ వంతుగా ఖుర్బానీ ఇస్తారు. హజ్‌ యాత్రకు ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి సుమారు ఏడువేల మందికిపైగా బయలుదేరి వెళ్లారు. యాత్ర సోమవారంతో ముగియనుంది. హజ్‌కు వెళ్లిన వారు ఒకటి రెండు రోజుల్లో స్వస్థలాలకు తిరుగు పయనం కానున్నారు.