మెట్రో రైళ్లు కోసం పరుగులు పెడుతున్న జనం.

0
174

గ్రేటర్‌వాసుల కలల మెట్రో జర్నీకి సిటీజన్ల నుంచి ఆదరణ పెరుగుతోన్న విషయం విదితమే. ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్‌(29కి.మీ.), నాగోల్‌–హైటెక్‌సిటీ(28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు రూట్లలో నిత్యం సుమారు మూడు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వీరిలో కొందరు కొత్తవారు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో జర్నీలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెట్రో అధికారులు ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. ఆ వివరాలివీ.

స్టేషన్లు, రైలులో చేయాల్సిన పనులివీ..

  •  మీకేదైనా సహాయం కావాలంటే కస్టమర్‌ సర్వీస్‌ బృందం, స్టేషన్‌ సిబ్బందిని సంప్రదించాలి.
  • మెట్రో స్టేషన్‌ లేదా భోగీలో నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలున్నట్లు అనుమా నిస్తే సిబ్బందికి వెంటనే తెలియజేయాలి.
  • స్టేషన్‌లోపలికి వెళ్లే సమయంలో వ్యక్తిగత, బ్యాగేజీ తనిఖీ విషయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలి.
  • ఎస్కలేటర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎడమవైపున మాత్రమే ఉండాలి.
  • ఎస్కలేటర్‌ దిగిన వెంటనే దానికి దూరంగా జరగాలి.
  • ప్రయాణిస్తున్నప్పడు సిబ్బంది టోకెన్లు, స్మార్ట్‌ కార్డులు చూపమని తనిఖీ చేసినపుడు వారికి సహకరించాలి. టిక్కెట్‌ లేని ప్రయాణీకులపై కఠిన చర్యలు తప్పవు.
  • రైలు ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే భోగీలోనికి ప్రవేశించాలి. రైలు కోసం పరుగెత్తరాదు.
  • రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఉండే సందులో ఎలాంటి వస్తువులు, కాళ్లను పెట్టరాదు.

చేయకూడని పనులివీ..

  • రైలులోనికి ప్రవేశించిన తరవాత ఫొటోలు తీయడం నిషిద్ధం.
  • రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు.
  • ప్రమాదకర వస్తువులు, అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్‌ పరిసరాలు, భోగీల్లోకి తీసుకురావద్దు.
  • ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోరాదు.
  • ప్లాట్‌ఫాంపై వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు.