అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు సంతృప్తికర స్థాయిలో ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి భూముల సమగ్ర రీసర్వేను త్వరగా పూర్తి చేయాలని, ఈ సందర్భంగా ఎక్కడా, ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైనవారిని గుర్తిస్తారని అన్నారు.
ఈ సందర్భంగా ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉగాదికి నెలరోజులకు ముందే భూమిని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేశామని, ఇళ్ల స్థలాల కోసం 23,448 ఎకరాలు గుర్తించామని, ఈ భూములపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, అర్బన్ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఈ భూమి ఏ స్థితిలో ఉందన్న దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉందా? లేదా? అన్న పరిశీలన వేగంగా జరుగుతోందని తెలిపారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షలమంది ఇళ్లస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అంచనా ఉందని,ప్రస్తుతం గుర్తించిన భూమి ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతామని అధికారులు వివరించారు. పట్టణాల్లో మరో 2 లక్షలమందికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి భూమి అందుబాటులో ఉందని, దాదాపు 15.75 లక్షలమందికి ఇంకా భూమిని సమకూర్చాల్సి ఉందంటూ ముఖ్యమంత్రికి అధికారులు నివేదిక అందించారు.