టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఎట్టకేలకు కాశ్మీర్‌లో సైనిక విధులు ముగించుకొని ఇంటికి చేరాడు. కాశ్మీర్ కల్లోలంలో సైతం సైనిక విధులు నిర్వహించి శభాష్ అనిపించుకున్న ధోనీ, ప్రస్తుతం ఇంటి బాటపట్టాడు. దాదాపు 15 రోజుల పాటు కఠినమైన పరిస్థితుల్లో సైతం ధోనీ సైనిక విధులు నిర్వహించడంతో ఆయన అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. అంతే కాదు ధోనీ ప్రస్తుతం ఢిల్లీకి చేరుకొని తన కూతురు జీవాతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచకప్ అనంతరం వెస్టిండీస్ టూర్ లో ఆడేందుకు టీమిండియాకు అందుబాటులో లేకుండా స్వచ్ఛందంగా తప్పుకొని సైనిక విధులు చేపట్టే నిర్ణయం తీసుకున్నాడు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పారాచ్యూట్ రెజిమెంట్ లో ధోనీ రెండు వారాల పాటు కశ్మీర్ లోయలో విధులు నిర్వహించాడు. అంతే కాదు ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయి…కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం లడక్‌లో ధోని జెండా ఎగురవేసి తోటి సైనికులతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాడు. మరోవైపు సైనిక విధులు ముగియడంతో ధోనీ ఇంటికి చేరుకున్నాడు.