ఫణిగిరి తవ్వకాల్లో వెలుగుచూసిన అరుదైన సున్నం విగ్రహం.

0
63

దేశంలోనే అత్యంత అరుదైన గార శిల్పం ఇప్పుడు వాతావరణ ప్రభావానికి గురై ముక్కలు ముక్కలుగా విడిపోయి శిథిలమవుతోంది… వందల ఏళ్లుగా భూగర్భంలో సురక్షితంగా ఉన్న ఆ ప్రతిమ, తవ్వకాల్లో వెలుగు చూశాక ఇప్పుడు రూపు కోల్పోతోంది. దాదాపు 6 అడుగుల పొడ వున్న ఈ బోధిసత్వుడి విగ్రహం ఇక్ష్వాకుల కాలంలో క్రీ.శ. మూడో శతాబ్దంలో రూపొందినట్టుగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్థూప కేంద్రమైన ఫణిగిరిలో గత ఏప్రిల్‌లో ఇది బయటపడింది.  ఇది డంగు సున్నంతో రూపొందిన విగ్రహం కావటం, తయారై దాదాపు 1700 సంవత్సరాలు కావస్తుండటంతో దానికి వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది.

దాదాపు 1700 ఏళ్లక్రితం ఆ విగ్రహం రూపొందిందని స్థల చరిత్ర ఆధారంగా అధికారులు అప్పట్లో గుర్తించారు. ఫణిగిరి బౌద్ధక్షేత్రం కావటంతో ఈ ప్రతిమ కూడా బుద్ధుడిదే అయి ఉంటుందని భావించారు. కానీ విగ్రహంపైన ఆభరణాల గుర్తులున్నాయి. దీంతో అది ఓ రాజుదిగా తేల్చారు. విగ్రహంపై అలంకరణకు సంబంధించి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి, ఒక చేయి, కొంతభాగం కాళ్లు ఉన్నాయి. విగ్రహంపై ప్రస్తుతానికి మిగిలిన ఆనవాళ్ల ఆధారంగా అదే డంగు సున్నం మిశ్రమంతో దాని పూర్వపు రూపాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్ధతిలో దాన్ని గాలి చొరబడని గాజు పెట్టెలో భద్రపరిస్తే భావితరాలకు అందించే వీలుంటుంది. ఇలా నెలల తరబడి నిర్లక్ష్యం కారణంగా సున్నపు విగ్రహం తేమను పీల్చుకుంటూ శిథిలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి అరుదైన విగ్రహాలు ధ్వంసమైతే భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతుందని అంటున్నారు.