చుట్టూ అడవి..పచ్చటి పరిసరాలు..ఎర్రటి కొండలు..రణగొణులు లేని ప్రశాంత క్షేత్రం యాగంటి. బనగానపల్లెకు 13 కిలోమీత్రాల దురంలో ఉండే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముక్యత ఉంది. ప్రతి నిత్యం ఇక్కడపూజలు జరుగుతుంటాయి. యాగంటి క్షేత్ర ఉనికి పురాణకాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశారని, ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువైయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘‘నేకంటి నేకంటì ’’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు.ఏకశిలపై నందిని ఉమామహేశ్వరులు వెలిసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు కలియుగాంతానికి ఒక సూచనగా ఈ క్షేత్ర ప్రస్థావన చేశారు.
ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. ఒకానొక సమయంలో అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తేంటే కాకాసురడనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించిన్నట్లు ప్రతీతి. ఆగ్రహించిన ఆగస్త్యముని ఈక్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు మచ్చుకైనా కానరావు. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడు. కనుక ఇక్కడ నవగ్రహాలు ఉండవు. ఫలితంగా శని ప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది.
యాగంటి క్షేత్రం బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు.