ఆమె ముఖం గ్లామర్‌తో వెలిగిపోతూ ఉంటుంది. ర్యాంప్‌పై నడుస్తుంటే మోముపై చిరునవ్వు తొణికిసలాడుతూ ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనక ఎన్నో కన్నీళ్లు దాగున్నాయి. ఆమె బాల్యమంతా కష్టాలతోనే గడచింది. కష్టాల కడలిని దాటి ఇప్పుడు మోడలింగ్ రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది నిశా యాదవ్.
బాల్యమంతా కష్టాలతోనే గడిచింది. రోజూ ఆరు కిలోమీటర్లు నడిచి స్కూలుకెళ్లింది. చిన్న వయసులోనే పెళ్లి చేయాలని చూస్తే ఇంటి నుంచి బయటికొచ్చింది. కష్టాల కడలిని దాటి ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయకుండా, చదివిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారనడానికి నిశా యాదవ్ జీవితం మంచి ఉదాహరణ. నిశా బాల్యం సాఫీగా సాగలేదు. అన్నీ కష్టాలే. తండ్రి చిన్న వయసులోనే పెళ్లి చేయాలని చూడడంతో ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఫలితంగా ఇల్లు వదిలి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయినా స్వయంకృషితో చదువు కొనసాగించింది. ప్రస్తుతం లా మూడో సంవత్సరం చదువుతూ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది.