మత్తుకు బానిసలవుతున్న యువత

0
41

రాజధాని నగరంలో యువతపై గంజాయి పంజా విసురుతోంది. కాలేజీ విద్యార్థులను ప్రధాన లక్ష్యంగా చేసుకుంటోంది. యువతులూ బానిసలుగా మారుతున్నారు. గంజాయి పొడిని సిగరెట్లలో దట్టించి దమ్‌ మారో దమ్‌.. అంటున్నారు. కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ సై అంటున్నారు. గతంలో పరిమిత ప్రాంతాల్లోనే కొనసాగే విక్రయాలు హైదరాబాద్‌ నగరం నుంచి శివారు ప్రాంతాల్లోని గల్లీలకు విస్తరిస్తున్నాయి. పట్టపగలే యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి.

గంజాయి మత్తుకు అలవాటు పడిన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులు తాము గంజాయి పీల్చడమే కాకుండా విక్రయాల ద్వారా ఖర్చులకు వస్తాయని గ్రహించారు. సింగపూర్‌ టౌన్‌షిప్‌లో తాముంటున్న ఫ్లాట్‌లోనే గంజాయి పొడిని తెచ్చుకుని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు రెండేళ్ల క్రితం ధూల్‌పేటకు వెళ్లి గంజాయి సిగరెట్లు కొనేవారు. వైజాగ్‌ నుంచి గంజాయి వస్తుందని తెలుసుకుని అక్కడకెళ్లి గంజాయిని కిలో రూ.2వేలకు కొని ఇక్కడికి తెచ్చి రూ.5వేలకు విక్రయించేవారు. స్నేహితులకు విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దరినీ కొద్దినెలల క్రితం అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.