తొలి తెలుగు పద్యం ‘తరువోజ’కు పుట్టినిల్లు మన అద్దంకే. మహాభారత ఇతిహాసాన్ని పరిపూర్తి చేసి ప్రపంచ సాహిత్యంలో భారత విశిష్టతకు పాదులు తవ్విన ఎర్రన కవి మనవాడే. సంగీత సామ్రాజ్యాన్ని మేలి మలుపు తిప్పిన మధుర వాగ్గేయకారుడు మన త్యాగరాజే. ఆధునిక కాలాన పద్యానికి బువ్వపెట్టి ఘనకీర్తిని చాటిన మధుర కవి మల్లవరపు జాన్ మనలో ఒకరే. మధురమైన వచన కవిత ద్వారా మానవీయత చాటిన జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డడే.
తొలి తెలుగు పద్యం తరువోజ కొలువైన అద్దంకి శాసనం రోడ్డు విస్తరణలో శిథిలమైంది. 200 సంవత్సరాలు ఎవరూ పట్టించుకోనప్పుడు మహాభారత ఇతిహాసంలో ఆదికవి విడిచిపెట్టిన అరణ్య పర్వశేష భాగాన్ని పూర్తి చేసిన కవితా వీరుడు ఎర్రన సాహితీ ఉద్ధరణకు ఇక్కడ కార్యాచరణ లేదు.
గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకలోకి తెచ్చి, నిత్య వ్యవహార భాషలోని అందాన్ని చాటిచెప్పిన గిడుగు రామ్మూర్తి పంతులు 156వ జయంతి నేడు. ఆయన పుట్టిన రోజును మాతృ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. వ్యావహారిక భాషా కోసం ఆజన్మాంతం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో మన ప్రాంత భాషా, సాహిత్య విశిష్టతల ఉద్ధరణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని భాషా సాహిత్యవేత్తలు పేర్కొంటున్నారు.