ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట సింధు.. సింధు.. ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత అయినప్పటి నుంచీ దేశం మొత్తం సింధు గురించే మాట్లాడుకుంటోంది. అదే సమయంలో మరో అమ్మాయి కూడా స్వర్ణం గెలుచుకుంది. ఆమె పేరు పెద్దగా ప్రజల నోళ్లలో నానడం లేదు. ఆమెనే మానసి గిరీష్ చంద్ర జోషి. పారా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన మానసి.
అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించడమంటే ఎంతో కష్టమైన పని. కానీ, పాతికేళ్ల వయస్సులో రోడ్డు ప్రమాదం కారణంగా ఎడమ కాలును పోగొట్టుకుని ఇక ఆటకు దూరమవుతుందేమో అనుకుంటున్న సమయంలో… అసమాన ప్రతిభ చూపించి పారా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించింది మానసి. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన భారత షట్లర్లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరిగిన వేదికలోనే ఈ టోర్నీ కూడా నిర్వహించారు.