సుగంధద్రవ్యాలలో మూడోస్ధానంలో ఉన్న యాలకుల ధర

0
64
సుగంధద్రవ్యాలలో మూడోస్ధానంలో ఉన్న యాలకుల ధరలు మరింత ప్రియమయ్యాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం వీటి ధరలు కిలో రూ.8000. మార్కెట్లో విడిగా తులం రూ.100గా విక్రయిస్తున్నారు. కుంకుమపువ్వు, వెనీలా తరువాత వినూత్న పరిమళంతో కొద్దిపాటి తియ్యదనంతో చిన్నచిన్న పలుకులతో ఉండి ప్రపంచాన్ని ఏలుతున్న మసాల దినుసు యాలకులు. మిఠాయిలు, బిర్యాని, ఇతర మసాలా వంటకాలలో వేయడానికి నగరవాసి జంకుతున్నాడు.
ఇలాచి ప్రియం కావడంతో కావలసినంత మోతాదులో దీనిని కలపక రుచి తగ్గిందని బిర్యానిప్రియులు వాపోతున్నారు. ఇక పేరొందిన ఆలయాల్లో ఇచ్చే ప్రసాదం లడ్డు, చెక్కరపొంగలిలలో కూడా ఇలాచి కంటికి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. అత్యధికంగా యాలకులు పండించే కేరళ రాష్ట్రంలో ఈసారి వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోవడంతో కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.