వెస్టిండీస్ పర్యటనలో ఖాళీ సమయాన్ని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సద్వినియోగం చేసుకుంటున్నాడు. కరీబియన్ దీవుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నాడు. రెండురోజుల క్రితం అక్కడి ప్రఖ్యాత కోకోబే రిసార్ట్‌కు వెళ్లిన శాస్త్రి గురువారం గాయకుడు ‘బాబ్‌మార్లే’ మ్యూజియం సందర్శించాడు. ఆయనతో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ సైతం ఉన్నారు. వీరంతా కరీబియన్ సంస్కృతిని బాగా అనుసరిస్తున్నారు! రంగురంగుల పూలచొక్కాలు, షార్ట్స్ ధరించారు. మ్యూజియంలోని బాబ్‌మార్లే విగ్రహం వద్ద ఓ చిత్రం తీసుకున్నారు. దాంతో పాటు ఓ వీడియోనూ రూపొందించి ట్విటర్‌లో పంచుకున్నారు. అందులో రవిశాస్త్రి మళ్లీ పాతరోజుల్లో మాదిరిగా ప్రజెంటర్‌గా మారిపోవడం గమనార్హం.
ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా కోచింగ్ సిబ్బంది పదవీ కాలం ముగిసింది. కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామితో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి మళ్లీ రవిశాస్త్రినే కోచ్‌గా ఎంపిక చేసింది.