బాలిక చికిత్స కోసం ఒక బొమ్మను కూడా జాయిన్ చేసుకున్న వైద్యులు

0
33

దేశరాజధాని ఢిల్లీలోని లోక్‌నాయక్ ఆసుపత్రిలో 11 నెలల బాలికను చికిత్సకు ఒప్పించేందుకు ఒక బొమ్మను కూడా జాయిన్ చేసుకున్న వైద్యులను సీఎం కేజ్రీవాల్ అభినందించారు.ఒక ట్వీట్‌లో సీఎం వైద్యులను ప్రశంసించడంతో పాటు ఆ చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్‌ను 4 వేల మంది లైక్‌చేయగా, 700 మంది రీట్వీట్ చేశారు.

ఆసుపత్రిలోని ఎముకల వైద్య చికిత్స విభాగంలో చేరిన ఒక చిన్నారికి రెండు కాళ్లకు కట్లుకట్టి పైనుంచి వేలాడదీసి ఉన్నాయి. తద్వారా ఆ బాలిక కాలి ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. కాగా ఆ చిన్నారి పక్కన ఆమె ఎంతగానో ఇష్టపడే బొమ్మ ఉంది. ఆ బొమ్మకు గల కాళ్లకు కూడా కట్లుకట్టి ఉన్నాయి. దరియాగంజ్‌లో ఉంటున్న ఆ చిన్నారి పేరు ఫరీన్. రెండు నెలల క్రితం ఆ చిన్నారి ఆసుపత్రికి వచ్చింది. బెడ్‌పై నుంచి కింద పడిపోవడంతో ఆ చిన్నారి కాళ్లకు ఫ్యాక్చర్ అయ్యింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అజయ్ మాట్లాడుతూ కాళ్లకు అయిన గాయాల కారణంగా ఆ చిన్నారి తరచూ ఏడుస్తోందన్నారు. అయితే ఆ చిన్నారి ఒక బొమ్మను ఎంతగానో ఇష్టపడుతుందని, ఆ బొమ్మకు పాలు ఇస్తానని చెప్పగానే, ఫరీన్ పాలు తాగుతుందని తల్లి చెప్పిందన్నారు. దీంతో వైద్యులు ఆమెకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. ఆ చిన్నారికి ఇంజెక్షన్ లేదా మందులు ఇచ్చేముందు ఆ బొమ్మకు ఇచ్చినట్టు నటించి, తరువాత చిన్నారికి ఇవ్వాలని సూచించారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యింది. కాగా ఆ బొమ్మను ఫరీన్‌కు ఆమె నాయనమ్మ బహుమతిగా ఇచ్చింది.