పాలుతాగే శిశువు తన ప్రాణాలు కాపాడుకోవాలనీ చేసిన పోరాటం..

0
39

పుట్టిన ప్రతిజీవీ బతకడం కోసం పోరాటం చేస్తుంది. మనిషి కూడా అంతే.. చివరికి పాలుతాగే శిశువు కూడా తన ప్రాణాలు కాపాడుకోవాలనీ.. అపాయం నుంచి బయటపడాలనీ చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడుతుంది. నమ్మబుద్ధి కావడం లేదా..? కేరళలో 11 నెలల శిశువు అర్థరాత్రి సమయంలో కారడవిలో ఒంటరిగా తనను తాను బతికించుకోవడం కోసం చేసిన ప్రయత్నం చూస్తే ప్రతి జీవీ బతికేందుకు చేసే ప్రయత్నం అర్థమవుతుంది.

రాత్రి 10 గంటల సమయంలో ఎస్‌యూవీ వాహనం నుంచి 11 నెలల పసికందు కిందికి జారిపడిపోయింది. ఇలా పాప పడ్డ స్థలం ఏ పట్టణమో.. గ్రామమో కాదు.. కారడవి. ఏనుగులు సహా అనేక క్రూర జంతువులు సంచరించే ప్రాంతం ఇది. కానీ ఈ పసికందు.. కిందపడ్డ వెంటనే ఏం చేసిందో చూడండి. తల్లిఒడిలో నుంచి కింద పడిపోయినట్లు ఆ పసిమెదడుకు ఎలా తెలిసిందో.. చుట్టూ కళ్లుపొడుచుకున్న కనిపించని చీకటిలో తనను తాను ఎలా రక్షించుకునేందుకు ఎలా అన్వేషించిందో ఈ సీసీటీవీ ఫుటేజీ మనకు చూపుతోంది. కింద పడ్డ పాప చుట్టూ చూసింది.. దూరంగా చెక్ పోస్ట్ వద్ద నుంచి వెలుతురు ఆ చిట్టికళ్లకు కనిపించింది. అంతే.. వెలుతురు ఉంటే మనుషులు ఉంటారనుకుందేమో.. తనను రక్షిస్తారని భావించిందేమో.. ఆ పసిబిడ్డ పాకుతూ పాకుతూ ఆ వెలుతురు వైపుగా వెళ్లింది. చెక్ పోస్ట్ వద్ద కాపలాగా ఉన్న అటవీశాఖ సిబ్బంది.. పసికందును రక్షించారు.

 అర్థరాత్రి వేళ ఈ 11 నెలల చిట్టితల్లి తన తెలివితేటలను ఎలా ఉపయోగించి తనను తాను అడవిలోని జంతువుల నుంచి.. రోడ్డుపై వెళ్లే వాహనాల నుంచి ఎలా కాపాడుకుందో.. తొలి మానవుడు కూడా అలాగే పోరాడి ఉంటాడు. అందుకే.. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది మన బతుకే.