తన ఇంటిని మ్యూజియంలా మార్చిన అభిమాని గౌరవ్‌ శర్మ

0
45

 అభిమానుల గురించి తెలుసు.. వీరాభిమానుల గురించి తెలుసు.. కానీ ప్రస్తుతం చెప్పుకోబోయే వ్యక్తి వీరందరిని మించిన వాడు. ఏ పేరుతో పిలవాలో తెలియడం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రముఖ గాయని లతా మంగేష‍్కర్‌ మీద అభిమానంతో తన ఇంటిని మ్యూజియంలా మార్చడమే కాక.. ఏకంగా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ డై హార్డ్‌ ఫ్యాన్‌ కథేంటో చూడండి.. సాధారణంగానే లతా మంగేష్కర్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువ. కానీ మీరట్‌కు చెందిన గౌరవ్‌ శర్మ అనే వ్యక్తి లతాజీ గాత్రానికే కాక ఆమె జీవితంలో పడిన కష్టానికి కూడా అభిమాని అయిపోయాడు. లతా మంగేష్కర్‌ పాడిన ప్రతి పాటను కలెక్ట్‌ చేశాడు. కేవలం పాటలు మాత్రమే కాక దేశవిదేశాల్లో ఆమె మీద వచ్చిన పుస్తకాలను కూడా సేకరించాడు. లతాజీ పేరు మీద ఉన్న ప్రతి దాన్ని సేకరించి తన ఇంటిని నింపేశాడు. మొత్తంగా తన ఇంటిని చిన్న సైజు లతా మంగేష్కర్‌ మ్యూజియంగా మార్చేశాడు.

‘చిన్నప్పటి నుంచి లతాజీ పాటలు అంటే పడి చచ్చేవాడిని. నాతో పాటు ఆమె మీద నా అభిమానం కూడా పెరిగి పెద్దవసాగింది. నా జీవితం అంతా ఆమెని ఆరాధించడానికే సరిపోతుంది. ఆమె నా గురువు, దైవం. నేను ఆమెకు శిష్యుడిని, భక్తుడిని. ఇక వేరే స్త్రీకి నా హృదయంలో, జీవితంలో చోటు లేదు’ అని తెలిపారు. లతా జీకి సంబంధించిన పాటలు, పుస్తకాలు, వస్తువులు మాత్రమే కాదు ఆఖరికి ఆమె చేసిన ట్వీట్‌లను కూడా కలెక్ట్‌ చేశాడు గౌరవ్‌.