ఒకే రోజున బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌లుగా ఐదుగురు

0
55

ఒకే రోజున పోలీస్‌ కమిషనర్‌లుగా ఐదుగురు వ్యవహరించారు. వారు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించి అనంతరం కమిషనర్‌లుగా విధులు నిర్వ హించారు. ఇదేంటని ఆశ్చర్య పోతున్నారా?! కేన్సర్‌, కిడ్నీ, తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ఈ ఐదుగురు చిన్నారులను ఒకరోజు గౌరవ కమిషనర్లుగా నియమించి వారి ఆశను పోలీస్‌కమిషనర్‌ భాస్కరరావు నెరవేర్చారు. ఐదుగురు చిన్నారులకు పోలీసులుగా కొనసాగాలనేది ఆశ. వారి ఆశను నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కరరావు  తీర్చారు. దీంతో వారు ఒకే రోజున బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌లుగా వ్యవహరించారు. వారు పోలీస్‌ కమిషనరేట్‌కు చేరుకోగానే సిబ్బంది వారికి గౌరవవందనం చేశారు. ఆ తర్వాత నేరుగా ఛాంబర్‌కు చేరుకుని కమిషనర్‌లుగా విధులు నిర్వహించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నివసించేఈ చిన్నారులు ప్రాణాంతకమైన జబ్బులతో బాధపడుతున్నారు. ఒకరోజైనా పోలీసులుగా వ్యవహరించాలని భావిస్తున్న వారు ‘మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌’ను సంప్రదించారు. వారికి ముందుగానే పోలీసు యూనిఫాం సిద్ధం చేశారు. కమిషనర్‌ ఐదుగురు చిన్నారులను సాదరంగా స్వాగతించి అనంతరం గౌరవవందనం ఇచ్చారు. కమిషనరేట్‌లో మధ్యాహ్నం దాకా వారు పోలీసులుగా వ్యవహరించారు. పోలీసు శాఖ విధులను తుపాకీ, ఇతరత్రా పరికరాల గురించి వివరించారు. చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.