మహేశ్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్‌ గ్రామం.

0
29

ప్రముఖ సినీహీరో మహేశ్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్‌ ప్రగతి పథంలో దూసుకువెళుతోంది. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మహేశ్‌బాబుకు చెందిన ప్రతినిధులు ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దత్తతకు ముందు ఎవ్వరికీ తెలియని ఈ గ్రామం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమైంది. మహేశ్‌బాబు శ్రీమంతుడు సినిమా తర్వాత 2015 సెప్టెంబర్‌ 28న సిద్ధాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో ఆయనకు చెందిన పలువురు ప్రముఖులు గ్రామాన్ని సందర్శించి ఇక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విడతల వారీగా పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామశివారులో రూ.. 1.50 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో అన్ని వసతులు, సౌకర్యాలతో నిర్మిస్తున్న పాఠశాల భవనం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. 

గ్రామాన్ని  మహేశ్‌బాబు దత్తత తీసుకోవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన సతీమణి రెండు పర్యాయాలు గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. మహేశ్‌బాబు త్వరలో గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించారు. కాగా మహేష్‌బాబు దత్తత తీసుకున్న తర్వాత గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మా గ్రామాన్ని దత్తత తీసుకున్న సినీహీరో మహేశ్‌బాబు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆయన సహకారం మరువలేనిది. గ్రామం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుమారు 1.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో ట్రస్ట్‌ నిర్మిస్తున్న పాఠశాల భవనం గ్రామానికే ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.