ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా ఒక నంబర్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభానికి సన్నాహకాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకు పైగా నియామకాలు చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లకు ఉద్దేశించిన కాల్ సెంటర్‌లలో ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రతీ శాఖ సహకారం అందించిందని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ సీఎంకు తెలిపారు. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్‌ను సిద్ధంచేస్తున్నామని..సెప్టెంబరు చివరి వారంలో పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ క్రమంలో పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను సీఎం జగన్ అభినందించారు.
పారదర్శక పద్ధతిలో పథకాన్ని లబ్ధిదారులకు అందించడానికే సాంకేతిక పద్ధతులు. వేలిముద్రలు సరిగ్గా పడకపోతే వీడియో స్క్రీనింగ్ ద్వారా వెంటనే పథకాన్ని అందించాలి. అంతేతప్ప సాంకేతిక కారణాలు చూపి ఏ పథకాన్ని కూడా నిరాకరించరాదని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 237 సర్వీసులు. 72 గంటల్లోగా అందే సర్వీసులు 115 కాగా…మిగిలిన సర్వీసులు కూడా ఎప్పటిలోగా చేస్తామన్న దానిపై వర్గీకరణ చేయాలి. డిసెంబరులో కొత్త పెన్షన్లు ఇవ్వాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.