శ్రీవేంకటేశ్వరస్వామి అనన్య భక్తురాలిగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. ఎలాంటి ప్రసార సామగ్రి లేని సమయంలోనే ఆమె శ్రీవారు, అన్నమయ్య సంకీర్తనల తొలి ప్రచారకురాలుగా నిలిచారు. శ్రీవారు, అన్నమయ్య కీర్తనలను ప్రపంచానికి అందించడంలో ఎనలేని సేవచేశారు. శ్రీవారి సుప్రభాతాన్ని మారుమూల గ్రామాలకు తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుంది. శ్రీవారి సుప్రభాతం ప్రపంచవ్యాప్తంగా నేటికీ ఎమ్మెస్ గొంతుకతో వింటేనే స్వామి నిదురనుంచి మేల్కొంటారనే నానుడు ఉంది. ఆ గొంతుక సుప్రభాతం వింటేనే సంగీత ప్రియులకు సంతృప్తి కలుగుతుంది. ఆమె ఆలపించిన బాలాజీ పంచరత్నాలు, అన్నమాచార్య కీర్తనలు, శ్లోకాలు, భజనలు, స్తోత్రాలు ప్రసిద్ధికెక్కాయి.
అప్పట్లోనే ఆ రికార్డులు, ప్రచారాల ద్వారా వచ్చిన నిధులను ఆమె టీటీడీకే అందజేసి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఆశించికుండా శ్రీవారికే కానుకగా ఇచ్చిన ఆ నిధులు ఇప్పుడు వడ్డీతో సహా కోట్లాది రూపాయలు టీటీడీ ఖజానాలో జమ అయ్యాయి. తిరుపతి త్యాగరాజ మండపంలో సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదును ఆమె అందుకున్నారు. ఇదే వేదికలో తన గాత్రంతో శ్రోతలను మైమరపించారు. ఆమె 2004 డిసెంబర్ 11న పరమపదించగా, ఆమె తొలి కాంస్య విగ్రహం తిరుపతిలోనే ఏర్పాటు చేశారు.