సినిమాల్లో గుర్తింపు వచ్చిన తరువాత తన మొదటి ఫ్యాన్స్ అసోసియేషన్ వైజాగ్‌లోనే ఏర్పాటయిందని నటి జయసుధ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సుబ్బరామిరెడ్డి లలిత కళాపీఠం ఆధ్వర్యంలో నటి జయసుధకు అభినయ మయూరి బిరుదును పోర్టు ఆడిటోరియంలో మంగళవారం అందజేశారు. బిరుదు అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అభిమానుల్లో ఎక్కువ మంది విశాఖలోనే ఉన్నారన్నారు. అలాంటి విశాఖలో గొప్ప బిరుదు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీఎస్సార్ నిరంతరం కళాకారులను ప్రోత్సహించడమే అలవాటుగా మార్చుకున్నారన్నారు. అంతేకాకుండా విశాఖను ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించి ఉండరని చెప్పారు.
ఇంత మంది ప్రముఖుల మధ్య తనకు అభినయ మయూరి బిరుదు ప్రదానం చేయడం చాలా మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందన్నారు. ముందుగా టీఎస్సార్ ఓంకారం నాదంతో కార్యక్రమం ప్రారంభించారు. నిరంతరం కళాకారులను ప్రోత్సహించడంలో టీఎస్సార్ తరువాతే ఎవరైనా అన్నారు. జయసుధ నటన చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. అందుకే ఆమె సహజనటి అయిందని కొనియాడారు. సహజనటి జయసుధను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు.