ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోనుంది. 14రోజులపాటు సాగే చంద్ర రాత్రి ప్రారంభమైంది.
చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్ ల్యాండర్.. అందులోని రోవర్ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక, 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక.. చంద్రయాన్-2 ఆర్బిటర్ మళ్లీ విక్రమ్ ల్యాండర్ కోసం వెతకనుంది. కానీ, అప్పటికీ విక్రమ్ దొరికే అవకాశాలు తక్కువేనని, మళ్లీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పరుచుకోవడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.