ప్రముఖ స్టార్‌ కమెడియన్‌ వేణుమాధవ్‌ కన్నుమూత.

0
66

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు.

బుధవారం మరణించిన హాస్యనటుడు వేణు మాధవ్‌ మృతిపై పవన్‌ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్‌ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించటం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్‌ ఉన్న నటుడు, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్‌లో అందరినీ సరదాగా ఉంచేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు పవన్‌.

కెరీర్‌ తొలినాళ్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన వేణుమాధవ్‌, తొలి ప్రేమ సినిమాతో బ్రేక్‌ వచ్చింది. ఆ సినిమాలో ప్రేమికుల గురించి వేణు మాధవ్ చెప్పిన డైలాగ్‌ సెన్సేషన్‌ సృష్టించింది. తరువాత దిల్‌, ఆది, ఛత్రపతి, సై లాంటి సినిమాల్లో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ సినిమాలో చేసిన సత్తన్న పాత్రకు నంది అవార్డు సైతం వరించింది.