మళ్లీ కుండపోత వర్షం. గోదారులుగా మారిన రహదారులు

0
27

నగరంలో మళ్లీ కుండపోత కురిసింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. గుడిమల్కాపూర్, రెడ్‌హిల్స్, నాంపల్లి, శ్రీనగర్‌కాలనీ, జూబ్లీహిల్స్, కార్వాన్, ఆసిఫ్‌నగర్‌తో పాటు చాలా ప్రాంతాల్లో 10–15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ గోదారులయ్యాయి. 

నీట మునిగిన ప్రాంతాలకు వెంటనే మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను పంపించి సహాయ చర్యలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా.. డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలు (డీఆర్‌ఎఫ్‌)తొలగించాయి. హుస్సేన్‌సాగర్‌ నాలా గోడ ఒకవైపు పాక్షికంగా కూలడంతో రాజ్‌భవన్‌ ఎదురుగా ఉన్న ఎంఎస్‌ మక్తా బస్తీలోకి వరద చేరడంతో జలమయమైంది. దాదాపు 200 ఇళ్లకు పైగా నీట మునిగాయి. విషయం తెలుసుకున్న మేయర్‌ అక్కడికి డీఆర్‌ఎఫ్, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను పంపించడంతో పాటు తెల్లవారుజామున 4గంటలకు ఆయనా మక్తాకు చేరుకున్నారు. దగ్గరుండి మరీ సహాయక చర్యలను పర్యవేక్షించారు.