గద్దలకొండ గణేష్ కథ తనకు నచ్చినా.. ఎన్నో సందేహాలు తలెత్తాయని.. పెదనాన్న చిరంజీవి ధైర్యమిస్తూ వెన్ను తట్టడంతోనే ముందడుగు వేయగలిగానని గద్దలకొండ గణేష్ చిత్రం హీరో వరుణ్ తేజ్ అన్నారు. తన పాత్రకు విశేష ప్రేక్షకాదరణ లభిస్తున్నందుకు ఎంతో సంతోషం కలుగుతోందని చెప్పారు. అందరికీ ఈ పాత్ర నచ్చుతుందని అనుకున్నా కానీ మరీ ఇంత నచ్చుతుందని మాత్రం అనుకోలేదని చెప్పారు. విజయయాత్రలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు.. విడుదలైన తర్వాత పరిణామాల గురించి మాట్లాడారు.
‘పెదనాన్న చిరంజీవి ఇచ్చిన ధైర్యంతోనే గద్దల కొండ గణేష్ చిత్రంలో నటించేందుకు ధైర్యంగా ముందడుగు వేశాను. గద్దల కొండ గణేష్ సినిమా స్టోరీ విన్నప్పుడు నాకు తెగ నచ్చింది. అయితే కొందరు సన్నిహితులు మాత్రం వద్దన్నారు. దాంతో తటపటాయించాను. అప్పుడు పెదనాన్న గుర్తుకు వచ్చారు. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం, సినిమాలను బాగ జడ్జ్ చేయగలగే అవగాహన ఉన్న ఆయనకు విషయం చెబితే బాగుంటుందనిపించింది. నేను, డైరెక్టర్ హరీష్ శంకర్ వెళ్లి స్టోరీ చెప్పాం. ఆయన థ్రిల్లయ్యారు. స్టోరీ చాలా బాగుందని, మంచి పేరు వస్తుందని చెప్పారు. ఆ ధైర్యంతో ఈ సినిమా తీశాం. సినిమా చూసిన తర్వాత పెదనాన్న మాతో మాట్లాడుతూ, అప్పుడు చెప్పిన కథ కంటే సినిమా చాలా బాగుందని ప్రశంసించారు.’ అని వరుణ్‌తేజ్ చెప్పారు.