వైఎస్‌ఆర్‌ స్మృతివనంలో అరుదైన వృక్షజాతులు

0
29

వైఎస్‌ఆర్‌ స్మృతివనాన్ని  బహుళ అభిరుచుల ఆలవాలంగా నెలకొల్పేందుకు నిర్మాణ కర్తలు కొన్ని కచ్చితమైన మార్గ దర్శనాలను అనుసరించారు. అందులో ఆధ్యాత్మిక ప్రశాంతత ఒకటి. జీవవైవిధ్యంతో పాటు హిందూ, క్రిష్టయన్, ఇస్లాం మత గ్రంథాల్లో , ప్రవచనాల్లో, పురాణాల్లో కనిపించిన, ప్రస్తావించిన మొక్కలను, వృక్షాలను చాలా మటుకు పవిత్ర వనంలో చేర్చారు. అందులో మహాశివుడి కళ్ల నుంచి పుట్టిందని చెప్పబడే రుద్రాక్ష, అమరకోశంలో ప్రస్తావించ బడిన పొగడ, మత్స్య పురాణంలో చెప్పబడిన శతావరి, మహాభారత, వాయు, వరాహ, వామన పురాణాలలో మహాభారత ఇతిహాసంలో కనపడే పారిజాతంతో పాటు ముస్లింలు దంతావధానానికి వినియోగించే మిష్వాక్, క్రిస్‌మస్‌ ట్రీకి పాకించే పిల్లి తీగల వంటి అనేక పౌరాణిక సంబంధ వృక్షజాతులను వైఎస్‌ఆర్‌ స్మృతివనంలోని పవిత్రవనంలో ఉంచారు. 

ప్రతి మనిషికి జన్మించిన ఘడియలను బట్టి ఓ జన్మనక్షత్రం ఉండి తీరుతుంది. 27 నక్షత్రాలకు అనుసంధానమైన వృక్షాలను వైఎస్‌ఆర్‌ స్మృతివనంలో ఒక చోట చేర్చి దాన్ని నక్షత్రవనంగా నామకరణం చేశారు. తమ జన్మ నక్షత్రానికి అనుసంధానమైన వృక్షం కింద యోగా చేసుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు ఎందరో ఇక్కడికి వస్తుంటారు. ఇవే కాకుండా ఆరు రాశులకు, సప్తరుషులకు, నవగ్రహాలకు కూడా ప్రత్యేక అనుసంధాన మొక్కలు వృక్షాలు, మొక్కలు వైఎస్‌ఆర్‌ స్మృతివనంలో ఉన్నాయి.  స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ విషయాలు తెలుసుకుని కాసేపు ఇక్కడ సేద తీరి మానసిక ప్రశాంతతను పొందుతున్నారు.