ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతికి నిరసనగా కొనసాగుతున్న బంద్‌.

0
39

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు చేపట్టిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్ కొనసాగుతోంది. అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంతాప సభలు ఏర్పాటు చేశారు. డిపోల నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా గేట్ల దగ్గర నిరసకారులు బైఠాయించారు. దీంతో జిల్లా బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. బంద్‌ నేపథ్యంలో జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ ఇంటివద్ద కూడా భద్రత ను కట్టుదిట్టం చేశారు. 

ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ.. కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు ఆదివారం అర్థరాత్రి నిర్వహించారు. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం  ఖమ్మం తరలించిన పోలీసులు.. రాత్రికిరాత్రే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆదివారం అర్థరాత్రే శ్రీనివాస్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, శ్రీనివాస్‌ రెడ్డి అంతిమయాత్రలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు మధ్య రాత్రి 9 గంట సమయంలో శ్రీనివాసరెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర బైపాస్‌ రోడ్డు ఎక్కగానే కాల్వోడ్డు హిందూ శ్మశాన వాటికకు తరలించేందుకు  పోలీసలు ప్రయత్నించగా.. కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. ఆర్టీసీ డిపో మీదుగా పోనివ్వాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులకు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు యాత్ర బస్‌డిపో మీదుగా శ్మశానవాటిక వద్దకు సాగింది. రాత్రి 11 గంటల తర్వాత అంత్యక్రియలు పూర్తయ్యాయి.