11వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె.. మంత్రులకు పిండ ప్రదానం చేసిన కార్మికులు.

0
32

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో మంగళవారం కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నాయి. బస్సు డిపోల ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. కార్మికులకు మద్దతుగా విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. కాగా, ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని సీనియర్‌ నాయకుడు కె. కేశవరావు ముందుకు వచ్చినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు సమ్మె నేపథ్యంలో హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.  

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి బీజేపీ, కాంగ్రెస్‌, సీఐటీయూ, వివిధ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీల నాయకులు కలిసి మానవహారం నిర్వహించారు. కరీంనగర్ బస్టాండ్‌లో సీఎం కేసీఆర్, మంత్రులకు పిండ ప్రదానం చేస్తూ ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు మోకాళ్లపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు.